Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌: సీఎం జగన్‌

అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌: సీఎం జగన్‌
విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (17:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చించారు.

 
స్కూళ్లలో హాజరు నానాటికీ మెరుగు అవుతోంద‌ని పేర్కొంటూ,  కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల హాజరుపై సీఎం ఆరా తీశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు చెప్పారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయినందున వారుకూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వివ‌రించారు. 
 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి...ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని తెలిపారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన  ఉద్దేశమ‌ని సీఎం చెప్పారు. ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామ‌ని, విద్యా కానుకను అమలు చేస్తున్నామ‌ని వివ‌రించారు. వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దామ‌ని, అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామ‌ని చెప్పారు. 2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరుకు అనుసంధానం చేయాల‌ని,  75 శాతం హాజరు ఉండేలా చూడాల‌న్నారు. 
 

అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాల‌న్నారు. ప్ర‌తి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ఉండాల‌ని, దీని మీద మ్యాపింగ్ చేసి.. ప్లే గ్రౌండ్‌లేని చోట భూ సేకరణ చేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాల‌న్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని, పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్‌కి ఉపయోగపడేలా ఉండే షూ ఇవ్వాల‌ని వాటిని పరిశీలించిన సీఎం కొన్ని సూచనలు చేశారు. ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలని సీఎం చెప్పారు. 
 

ఎయిడెడ్‌ స్కూళ్లను ఎవ్వరూ బలవంతం చేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల‌ని, ఎయిడెడ్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంద‌ని, లేదా వాళ్లు నడపాలనుకుంటే వారే నడుపుకోవచ్చన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా, ఎండిఎం అండ్‌ శానిటేషన్‌ డైరెక్టర్‌ బి ఎం దివాన్,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రికి రాత్రే రూ.1.5 కోట్లు సంపాదించాడు...