Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక యజ్ఞంలాగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం... చంద్రబాబు

‘‘ఒక పవిత్ర యజ్ఞంగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం. ఎక్కడా పనులు ఆగకూడదు, పనులు ఆపకుండానే సమస్యలను పరిష్కరించాలి. ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో సమస్య ఉందో గుర్తించాలి, అధిగమించాలి. అందరూ అన్ని స్థాయిల్లో శ్రద్ధతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు

ఒక యజ్ఞంలాగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం... చంద్రబాబు
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (21:12 IST)
‘‘ఒక పవిత్ర యజ్ఞంగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం. ఎక్కడా పనులు ఆగకూడదు, పనులు ఆపకుండానే సమస్యలను పరిష్కరించాలి. ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో సమస్య ఉందో గుర్తించాలి, అధిగమించాలి. అందరూ అన్ని స్థాయిల్లో శ్రద్ధతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటాం. అందరిలో బాధ్యత రావాలి, సమష్టిగా బాధ్యతలు పంచుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ‘నీరు-ప్రగతి, వ్యవసాయం’ పురోగతిపై  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ముస్సోరి శిక్షణా శిబిరంలో పాల్గొన్న సీనియర్ ఐఏఎస్‌లు, ఫౌండేషన్ కోర్సుకు హాజరైన అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మెచ్చుకున్నారని, అందరూ అభినందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం రాష్ట్రాభివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇనుమడింప చేయాలని దిశానిర్దేశం చేశారు.
 
‘‘28ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తికావాలి. భవిష్యత్తులో రాష్ట్రంలో తాగునీటి సమస్య అనేదే రాకూడదు. నీటి నిర్వహణ సమర్ధంగా జరగాలి. తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమల అవసరాలకు కావాల్సిన నీటిని అందించాలి. సాగు చేసిన పంటలను కాపాడాలి. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించాలి. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్‌ను మరింతగా ప్రోత్సహించాలి’’ అని దిశానిర్దేశం చేశారు.
 
అక్టోబర్ 3 వరకు రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని, ఎగువ కృష్ణాకు వరద ప్రవాహం (ఇన్‌ఫ్లో) భారీగా రానుందని ఆర్‌టిజి, ఇస్రో అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాననీటిని భూగర్భజలంగా మార్చడమే మనముందున్న కర్తవ్యంగా పేర్కొన్నారు. చెరువులు, పంటకుంటలు, చెక్ డ్యాములు అన్నింటిలో జలకళ ఉట్టిపడాలన్నారు.
 
దసరా సందర్భంగా రేపటి నుంచే పింఛన్ల పంపిణీ:
అక్టోబర్ 30, నవంబర్ 1, 2 తేదీలు పండుగ సెలవులు కాబట్టి పింఛన్లకు ఈ రోజే నిధులు విడుదల చేయాలని ఆర్ధికశాఖ అధికారులను ఆదేశించారు. రేపటి నుంచే వృద్ధులు, వికలాంగులు, అనాధలకు పింఛన్ల సొమ్ము పంపిణీ చేయాలన్నారు. ఈ పండుగను వృద్ధులు, వికలాంగులు, అనాధలు, నిరుపేదలు ఆనందంగా జరుపుకోవడమే నిజమైన దసరాగా పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడమే నిజమైన దసరా అన్నారు.
 
గత ఏడాది కన్నా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.100 కోట్లు తక్కువ వ్యయం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇటీవల మంజూరైన రూ.337 కోట్ల లేబర్ బడ్జెట్ పూర్తిగా వ్యయం చేయాలన్నారు. 1,400 అంగన్ వాడి కేంద్రాల నిర్మాణం 2,800 కి.మీ సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తికావడం పట్ల సంతృప్తి ప్రకటించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయంటూ, మిగిలిన జిల్లాలు కూడా పోటీపడాలన్నారు. వర్షాలు పడే ప్రాంతాలలో భారీ ఎత్తున మొక్కలు నాటాలని, ప్లాంటేషన్ పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 1, 19, 420 పంటకుంటలు తవ్వకం పూర్తయ్యిందని, మరో 1,22,713 పంటకుంటల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు.
 
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ దినోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించాలని అన్నారు. పక్షం రోజులుగా జరిగిన స్వచ్ఛతే సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నవారిని గుర్తించి సత్కరించాలన్నారు. సిసి రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛాంధ్ర పనులు బాగా చేసిన సర్పంచులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, స్వచ్చంద సంస్థల సభ్యులను ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలన్నారు.
 
జాతీయసగటు కన్నా తక్కువగా ఎరువుల వినియోగం ఉండాలి :
ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంలో జాతీయసగటు కన్నా ఏపి తక్కువ ఉండాలన్నదే తన ఆకాంక్షగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ సగటు హెక్టారుకు 138 కిలోలు ఉండగా మన రాష్ట్రంలో 200 కిలోల పైబడి ఉండటం దురదృష్టకరం అన్నారు. క్రిమిసంహారక  మందుల వినియోగం కూడా జాతీయ సగటుకన్నా రాష్ట్ర సగటు ఎక్కువ ఉండకూడదన్నారు. దీనివల్ల రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోందని, పండించిన పంటలకు ధర రావడం లేదని గుర్తుచేశారు. సేంద్రియ సేద్యం వైపు మళ్లేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.
 
ఈ టెలికాన్ఫరెన్స్‌లో జలవనరులు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, ఆర్థికశాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్, సెర్ప్ ఉన్నతాధికారులు శశిభూషణ్, రాజశేఖర్, చిరంజీవి చౌదరి, జవహర్ రెడ్డి, రామాంజనేయులు, రవిచంద్ర, అహ్మద్ బాబు, కృష్ణమోహన్, ఇస్రో రాజశేఖర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)