Publish Date: Fri, 01 May 2026 (13:24 IST)
Updated Date: Fri, 01 May 2026 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షంలో ఉండే పార్టీ వైకాపా కాదని గొడ్డలి పార్టీ అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నామని, పేదల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ప్రజల సంతోషాన్ని చూసి.. కష్టాన్ని మరిచిపోతున్నట్లు చెప్పారు.
'పింఛన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదు.. బాధ్యతగా భావిస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదు. కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నాం. లేబర్ అడ్డాలు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మారాలి. పని ఉంటే పనికెళ్తారు.. లేని రోజు లేబర్ అడ్డాల్లో నైపుణ్యం పెంచుకుంటారు. తొలి దశలో లేబర్ అడ్డాలు విజయవంతమైతే.. మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాం' అని చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రస్తుతం మళ్లీ వెయ్యి కోట్లతో పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాం. 2027లో గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తాం. ఆ తర్వాత కృష్ణా నదికి అనుసంధానిస్తాం. డిసెంబర్ నాటికి బందర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం. హైదరాబాద్ - మచిలీపట్నం హైవే ఎక్స్‌ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చెందుతోంది. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఇప్పటివరకు పెంచలేదు. ఎన్నికలయ్యే వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వం విధించిన ట్రూఅప్ ఛార్జీలను ట్రూడౌన్ చేశాం. గత ప్రభుత్వం తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది.
ఇకపై ప్రతి సమావేశంలోనూ ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా. ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే.. వారికి ఇంకొక ఛాన్స్ ఉండదు. అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలులో ఈఎస్‌ఐ ఆస్పత్రులు తీసుకొస్తాం. శ్రీసిటీ, తిరుపతి, అమరావతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రులు తీసుకొస్తాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా లక్ష్యం. నేర ప్రవృత్తి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. వైకాపా అధినేతకు మానసిక సమస్య ఉంది. ఒకసారి అవకాశమిస్తే అందర్నీ మోసం, నాశనం చేశారు.
ప్రజావేదికను నిర్మిస్తే.. రెండు గంటల్లో కూల్చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. అమరావతిని శ్మశానం అని ప్రచారం చేశారు. పోలవరం పూర్తయి ఉంటే.. రైతులు బంగారం పండించేవారు. నీటి ఎద్దడి ఉండేది కాదు. గొడ్డలి పార్టీకి మద్దతిచ్చేవారు ఒకసారి ఆలోచించుకోండి. బాబాయిని హత్య చేసి గుండెపోటు అన్నారు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి.. నారాసుర రక్త చరిత్ర అని 'సాక్షి'లో రాశారు. విపక్షంలో ఉండేది వైకాపా కాదు.. గొడ్డలి పార్టీ' అని చంద్రబాబు ఆరోపించారు.