Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27న ఏపీ బడ్జెట్‌.. ఒక్క రోజే అసెంబ్లీ సమావేశం?

27న ఏపీ బడ్జెట్‌.. ఒక్క రోజే అసెంబ్లీ సమావేశం?
, సోమవారం, 23 మార్చి 2020 (07:43 IST)
కరోనా ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపైనా పడింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కేవలం ఒక్క రోజుకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ జాడలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెలుగులోకి రావడం ప్రభుత్వం హై అలర్ట్‌ అయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రధానంగా అమరావతి పరిధిలోని విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత ముందు జాగ్రత్తలు పాటిస్తోంది. తొలుత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు అసెంబ్లి సమావేశాలను నిర్వహించాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాలను కేవలం ఒక్క రోజుకే కుదించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

ఓటాన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, దాన్ని ఆమోదించి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని యోచిస్తోంది. బడ్జెట్‌ ఆమోదంతోనే ఏప్రిల్‌ నెల ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క రోజు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పీకర్‌ కార్యాలయం, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాయి.

అదే రోజున గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ ప్రతిపాదన, ఆమోదం పూర్తి చేయాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. పోలింగ్‌ కోసం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండటంతో, అదే సమయంలో ఓటాన్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే కరోనా ప్రభావం ముప్పు నుంచి కొంత మేరకు బయటపడవచ్చన్న ఆలోచనలో అధికార యంత్రాంగం ఉంది.

ప్రత్యేకంగా ఓటాన్‌ బడ్జెట్‌ సమావేశాలు మరోరోజు నిర్వహిస్తే.. మళ్లి ఎమ్మెల్యేలతో పాటు 56 మంది ఎమ్మెల్సీలు, వారి సిబ్బంది, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు అంతా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో అసెంబ్లీలో భారీగా జనసమూహం కూడే అవకాశాలు ఉండటంతో ఒకవైపు పోలింగ్‌ పూర్తి చేసుకుంటూనే.. మరోవైపు అసెంబ్లీని నడపాలన్న ప్రతిపాదనను అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోమవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్‌, సీఎం చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని అధికార యంత్రాంగం చెబుతోంది.

ఏదైనా సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు వస్తే.. మరొక పూట ఈ సమావేశాలను పొడిగించి, ఎట్టి పరిస్థితుల్లో ఓటాన్‌ బడ్జెట్‌ అకౌంట్‌ను ఆమోదించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఒకవేళ కరోనా కేసులు మరింత పెరిగితే ఈ సమావేశాలపై ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్ డౌన్.. ఇంటికి రూ.వెయ్యి : సీఎం జగన్ ప్రకటన