Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుల్లో ఎపీ ఫస్ట్‌ - భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు

Advertiesment
అప్పుల్లో ఎపీ ఫస్ట్‌ - భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:11 IST)
సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పులతో రాష్ట్రం అధోగతిపాలౌతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తంచేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత, ఇప్పటి ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల కోసం సంక్షేమ కార్యక్రమాల పేరుతో అప్పులుచేసి రాష్టాన్ని అధోగతిపాలుచేస్తున్నాయని  విమర్శించారు. 
 
దేశవ్యాప్తంగా ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అప్పుచేసిన వందలో రూ.51 సంక్షేమాలకే ఖర్చుచేస్తున్నారని ఇది అభివృద్ధికి నిరోధకంగా పేర్కొన్నారు. కేంద్ర పథకాలను పేరు మార్చి తమ కొత్త పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వమిత్ర భూసర్వే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ప్రారంభించినట్లు ఆరోపించారు. 
 
30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామని అందుకే భారీగా నిధులు వినియోగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రచారం మొత్తం శుద్ద అబద్దం. 30 లక్షల పట్టాలకు రూ.7 వేల కోట్లు కేటాయించారు. అందులో భారీగా అవినీతి జరిగింది. రూ.5 లక్షల విలువైన భూమిని రూ.25 లక్షలకు కొన్నారు. తెనాలిలో ఎకరం కోటిన్నకు కొన్నారు. రాజమండ్రిలో ఎకరం ఏడులక్షలు చేసే ముంపు అవ భూములను రూ.45 లక్షలకు కొన్నారు. అక్కడే రూ.150 కోట్లు అవినీతి జరిగింది. నెల్లూరులో జరిగిన అవినీతిని ప్రశ్నించిన కలెక్టర్‌ను బదిలీచేశారు. వీటిపై విజిలెన్సు విచారణ జరిపితే సగానికిపైగా అంటే రూ.3 వేల కోట్లకుపైగా అవినీతి బయటపడుతుంది.
 
కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట 23 లక్షల ఇళ్లు రాష్ట్రానికి కేటాయించింది. ఈ రెండేళ్లలో ఒక్కఇంటిని రాష్ట్రం కట్టలేదు. పైగా 15 లక్షల ఇళ్లే కడతామని చెప్పి 8 లక్షల ఇళ్లను వదిలేసింది. దాంతో ఈ 8 లక్షల ఇళ్లకు కేంద్రం ఇచ్చే రూ.12 వేల కోట్ల సబ్సిడీ వదిలేసుకున్నట్లయింది. మిగతా 15 లక్షల ఇళ్లకు రూ.22,050 కోట్ల సబ్సిడీని కేంద్రం ఇస్తుంది.ఇవి కాక మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం (నరేగా) ద్వారా మరో రూ.4 వేల కోట్లు తీసుకుని 30 లక్షల స్థలాలకు రోడ్లు వేశారు. అందులోనూ సగం తినేశారు. నిధులు ఎంత ఖర్చుచేస్తున్నారో తెలీనీయడం లేదు. 
 
జగన్‌ పాలన డబుల్‌ స్టిక్కర్‌ ప్రభుత్వంగా మారింది. 108, 100 కార్యక్రమాలకు కేంద్రం రూ.60 శాతానికి పైగా నిధులిస్తుంది. వీటిపై మోడీ ఫొటో ఉండదు. గత ప్రభుత్వం యాంత్రీకరణకు జాతీయ షెడ్యూల్‌ కులాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి పథకాల్లో భాగమైన వాహనాల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగితే దానిపై ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం లేదు. తెదేపా అవినీతిని జగన్‌ కప్పిపుచ్చుతున్నాడు. 
 
 
వెనుకబడిన తరగతుల వారికి, రైతులకు 90 శాతం సబ్సిడీతో ఇచ్చే పరికరాలను ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు. దాంతో లబ్దిదారులకు అన్యాయం జరుగుతుంది. భాజపా ప్రభుత్వం చేసినవి తెదేపా, వైకాపా చేయగలవా? కేంద్ర ప్రభుత్వం చిత్తూరుజిల్లలో ఏర్పాటుచేసిన సంస్థలు, అమలుచేస్తున్న కార్యక్రమాలు తెదేపా, లేదా వైకాపా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలవా? అంటూ సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. మదనపల్లెలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 
 
రాజకీయ అవినీతిని కడిగేసేందుకు భాజపా ఆవిర్భవించింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసిన వాజ్‌పేయి రోడ్లు వేశారు. ఫోన్లు ఇచ్చారు. సాహసోపేతంగా అణుబాంబును పరీక్షించారు. కొత్తరైళ్లు వేశారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేశారు. 2004 నుంచి 14 వరకు పాలించిన కాంగ్రెస్‌ లక్షల కోట్లు దోచేసింది. 
 
2014 లో ప్రజలు మోడీని ప్రధానిని చేశారు. ఆయన పాలనను మెచ్చి మరలా 2019లో 303 స్ధానాలు ఇచ్చి తిరిగి ప్రధానిని చేశారు. మొన్న దుబ్బాకలో భాజపాను గెలిపించారు. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానాన్ని గెలిపిస్తారు. ఈ ప్రాంతానికి మోదీ ఎన్నో చేశారు. అమృత పథకం ద్వారా రూ.100 కోట్లు ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి గాను మండలానికి రూ.100 కోట్లు కేటాయించారు. స్వచ్ఛభారత్‌ కింద అనేకపరికరాలిచ్చారు. 
 
చిత్తూరు జిల్లా అభివృద్ధికై పారిశ్రామిక సమూహాల నుంచి రహదారులు, రైల్వే లైన్లు, ఐఐటీ, త్రిపుల్‌ ఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ ఇలా ఎన్నో ఇచ్చారు. జగన్‌, చంద్రబాబు ఇవి ఇచ్చారా? ఇంత అభివృద్ధిని వారు చేయగలరా? మదనపల్లిలో లభించే మామిడి, టమోటా, చింతపండు, ఉల్లి పంటలకు విలువను జోడించి అధిక ఆదాయాన్ని ఆర్జించేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఇక్కడ భాజపా ఏర్పాటుచేస్తుంది. 
 
తేదేపా, వైకాపాలు ఇవి ఏర్పాటుచేయలేవు. అవి కుటుంబ వ్యాపార పార్టీలు. అభివృద్ది, నిజాయితీ భాజపా బలం. వనరులు భాజపా బలం. కేంద్రం అమలుచేసే పథకాలను క్షేత్రస్థాయిలో భాజపా కార్యకర్తలు పరిశీలించి అవినీతి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. 2024లో భాజపా - జనసేన ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయి. తప్పుచేసిన మంత్రులను ప్రశ్నిస్తోన్న భాజపా కార్యకర్తలపై రాష్ట్ర మంత్రులు అధికారబలంతో దాడులుచేస్తున్నారు. దీనిని భాజపా ఖండిస్తోంది. భాజపా కార్యకర్తల జోలికొస్తే సహించదు. మీ గుండెల్లో నిద్రపోతుందని ఆయన హెచ్చరించారు. 
 
ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, సీనియర్‌ నాయకులు నర్సింహారెడ్డి, మదనపల్లి అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రమేష్‌నాయుడు, నీలకంఠ, కిసాన్‌ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి, నాయకులు పగడి గోపాల్‌, నాగరెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రగిరిలో ముందే ‘సంక్రాంతి’