Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. మీడియాకు నో.. చంద్రబాబు ఖండన

30 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. మీడియాకు నో.. చంద్రబాబు ఖండన
, ఆదివారం, 29 నవంబరు 2020 (16:32 IST)
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి వెలగపూడిలో జరగనున్నాయి. శాసనసభ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1,637 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. 
 
భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ, నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 58 మంది సీఐలు, 9 మంది ఆర్ఐలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు. గరుడ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు బాధ్యతల పర్యవేక్షణ నిర్వహిస్తామని చెప్పారు. ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందని తెలిపారు. 
 
మరోవైపు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా, అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌ను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అని, అలాంటి మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్య చర్య అని విమర్శించారు. గతంలో మీడియా హక్కులను హరించేలా జీవో 2430 జారీ చేస్తే రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రెస్ కౌన్సిల్ కూడా ఆ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేసిందని చంద్రబాబు వివరించారు. 
 
ఇప్పుడు చట్టసభల్లోకి మీడియా ప్రవేశాన్ని నిరోధించడం అంతకంటే దారుణమైన చర్య అని అభివర్ణించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలకు మీడియాను అనుమతించారని, అక్కడలేని నిషేధం ఇక్కడెందుకని ప్రశ్నించారు.
 
చట్ట సభల్లో ఏంజరుగుతోందో ప్రజలకు తెలియకుండా ఉండేందుకు మీడియాను నిషేధించడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేశారు. చట్టసభల ప్రత్యక్ష ప్రసార అవకాశాన్ని తరతమ భేదాలు లేకుండా అన్ని మీడియా సంస్థలకు అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని చంద్రబాబు స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను సంకెళ్ల నుంచి విముక్తి చేస్తాయి : ప్రధాని మోడీ