Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
, సోమవారం, 30 నవంబరు 2020 (19:42 IST)
అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020ని సోమ‌వారం సభలో ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సభా నాయకుడు, సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది. పంచాయతీరాజ్‌ చట్టంకు సంబంధించి గతంలోనే సభలో చర్చ జరిగింది. ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే, వారు దాన్ని వెనక్కి పంపించారు.

ఆ తర్వాత మళ్లీ వారు నో చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు, వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారు.

ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నాం. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్టం సవరణ. అదే విధంగా ఏ రకంగా వేగంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నాం.

దీనిపై గతంలోనే విస్తృత చర్చ జరిగింది. ఇక్కడ ఆమోదించి మండలికి పంపిస్తే, వారు వెనక్కి పంపారు. కాబట్టి ఫార్మాలిటీగా ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టాం. అంతే తప్ప, ఆయన (చంద్రబాబు) ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు’ అని స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020ను సభ  ఆమోదించింది. ఈ క్రమంలో చర్చ జరగకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారంటూ ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే ఏడాది ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణం: డాక్టర్ జవహర్ రెడ్డి