ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవ నిర్వహణ కోసం రూ. 17 కోట్లతో నిర్మించిన కళ్యాణ వేదికను టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణం కమనీయంగా నిర్వహించడానికి కళ్యాణ వేదిక నిర్మించినట్లు చెప్పారు. కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది స్వామి వారి కళ్యాణం ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామన్నారు.
వచ్చే ఏడాది శ్రీ రామనవమి సందర్బంగా తొలిసారి ఈ వేదిక మీద స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. స్వామివారి దయతో అప్పటికి కోవిడ్ పూర్తిగా నశించిపోగలదనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
ఎస్ఈ 1 జగదీశ్వరరెడ్డి, ఒంటిమిట్ట డిప్యూటి ఈఓ లోకనాథం, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్, ఏఈ దేవరాజు ఈవో వెంట ఉన్నారు. ఇదిలా ఉండగా కార్తీక సోమవారం సందర్బంగా ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి వై ఎస్ ఆర్ జిల్లా కమలాపురం మండలం టి.చదిపిరాళ్లలోని శ్రీ పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.