Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేదాలకు నిలయం భారతదేశం : రాష్ట్ర గవర్నర్ నరసింహన్

పుట్టపర్తి : భిన్న సంస్కృతులున్న భారతదేశం వేదాలకు నిలయమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి 92వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం పుట్టపర్తి లోని సాయికుల్వంత్ హాల్లో శ్రీ సత్యసాయి మొదటి అంతర్జాతీయ వేద సద

వేదాలకు నిలయం భారతదేశం : రాష్ట్ర గవర్నర్ నరసింహన్
, సోమవారం, 20 నవంబరు 2017 (18:33 IST)
పుట్టపర్తి : భిన్న సంస్కృతులున్న భారతదేశం వేదాలకు నిలయమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి 92వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం పుట్టపర్తి లోని సాయికుల్వంత్ హాల్లో శ్రీ సత్యసాయి మొదటి అంతర్జాతీయ వేద సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తూ బహుళ మత ప్రార్థనల సదస్సు జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావడం తన అదృష్టం అన్నారు.
 
భారతదేశం వేదభూమి అంటూ అనేక భిన్నమైన సంప్రదాయాలు ఉన్నాయన్నారు. మొక్కలకు వేర్లు ఎంత ముఖ్యమో ధర్మానికి వేదాలు అంతే ముఖ్యమని చెప్పారు. పెద్దయెత్తున సామూహికంగా వేదపారాయణాలు జరిగాయని, ప్రస్తుతం మరోసారి ఇక్కడ వేదపారాయణం, వేదం ఘోష మనం వింటున్నామన్నారు. వేదాలు కల్పవృక్షమని, ధర్మ స్థాపన, వేద అధ్యయనం సాధనతోనే సాధ్యమన్నారు. అసతోమా సద్గమయ.. తమసోమ జ్యోతిర్గమయ అంటూ అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి పయనించేందుకు వేదాలు మార్గాన్ని సుగమం చేస్తాయన్నారు.
 
యోగ, ప్రాణాయామం ఎంతముఖ్యమో వేదాలు, వేద పారాయణం అంతే ముఖ్యమన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన పుట్టపర్తికి లక్షలాదిమంది సాయిభక్తులు వస్తుంటారని, ఆనందం, సంతోషం, జ్ఞానాన్ని ఇలా ప్రతి విషయాన్నీ అందరితో పంచుకోవడానికి చక్కటి అవకాశం దొరుకుతుందన్నారు. అహంకారాన్ని వదిలి, ఎవ్వరిని నొప్పించక అందరిని  సోదర భావంతో ప్రేమిస్తూ, మనమంతా ఒకే కుటుంబమని చాటి చెప్పాలన్నారు. వేద పారాయణాలు వినడం వల్ల ఏదో తెలియని వైబ్రేషన్స్ మనలో కలుగుతాయని, ఇది మనస్సుకు ఎంతో మంచిదని అన్నారు. 
 
సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస ఈ అయిదు మనస్సుకు ఏంతో తృప్తిని, సంతోషాన్ని కలిగిస్తాయన్నారు. ప్రతి మనిషి మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ వాటిని సుహృద్భావంతో ఆచరించాలన్నారు.  అసత్యం, హింసను వీడి ధర్మాన్ని అందరూ పాటించాలని చెప్పారు. సు.. దర్శన్ అంటే సన్మార్గంలో పయనించడమే అన్నారు. సర్వమతాలు సమానత్వమని ఎన్ని పేర్లతో పిలిచినా, ప్రార్థించినా భగవంతుడు ఒక్కరే అని భగవాన్ సత్యసాయి బాబా చాటిచెప్పిన ప్రభోదనలను ఆచరించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాముడిని ఉత్తర భారతీయులే కొలుస్తారు.. కానీ కృష్ణుడిని..?: ములాయం సింగ్