Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో ఆంత్రాక్స్..? వామ్మో జాగ్రత్త...

తిరుపతిలో ఆంత్రాక్స్..? వామ్మో జాగ్రత్త...
, శనివారం, 27 అక్టోబరు 2018 (18:50 IST)
ఆంత్రాక్స్ మహమ్మారి చాలాకాలం తరువాత మరోసారి కలకలం సృష్టించింది. కార్వేటినగరం మండలం కోదండరామాపురం దళితవాడకు చెందిన ఆరుగురు చేతులు, కాళ్ళ మీద బొబ్బలతో ఆసుపత్రిలో చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అంతేకాదు ఒకరికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించడంతో ప్రజల్లో ఆందోళన మరింత తీవ్రతరమవుతోంది. 
 
చిత్తూరు జిల్లాలో ఆంత్రాక్స్ మహమ్మారి మరోసారి వెలుగు చూసింది. కార్వేటినగరం మండలం కోదండరామాపురం దళితవాడకు చెందిన ఆరుగురికి ఆంత్రాక్స్ వచ్చిందన్న అనుమానంతో పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో ఆనందయ్య అనే వ్యక్తికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో పాటు చేతులు, కాళ్ళ మీద బొబ్బలు లేచి ఉండటంతో ఆంత్రాక్స్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయోనన్న అనుమానంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. 
 
మిగిలిన వారికి చేతులు, కాళ్ళ మీద బొబ్బలు లేచి పుండ్లు పడి ఉండడంతో ప్రాథమిక చికిత్స చేసి రక్త నమూనాలను తీసుకుని ఇళ్ళకు పంపించేశారు. 15 రోజుల క్రితం సమీప గ్రామంలో చనిపోయిన ఆవు మాంసాన్ని హరిజనవాసులు తిన్నారు. ఆ తరువాత గ్రామంలో 25 ఆవులు ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోయాయి. గత అనుభవాల దృష్ట్యా వాటి మాంసాన్ని గ్రామస్థులు తినలేదు. అయితే పదిరోజుల తరువాత ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఆరుగురిలో బయటపడ్డాయి. 
 
తొలుత లివర్‌కు సోకిన వ్యాధి క్రమంగా చర్మం మీద తేలి బయటపడింది. 18 సంవత్సరాల క్రితం కోదండరామాపురానికి సమీపంలోని టికేఎంపేట దళితవాడలో కూడా 65 మందికి ఆంత్రాక్స్ వ్యాధి సోకి ఇబ్బందిపడ్డ విషయాలను గ్రామస్తులు గుర్తుకు తెచ్చుకుని ఆందోళనకు గురయ్యారు. ఆంత్రాక్స్ వ్యాధి సోకిందని ప్రచారం జరగడంతో  వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. కోదండరామాపురం గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించింది.
 
తిరుపతిలో చికిత్స పొందుతున్న ఆనందయ్యకు ఆంత్రాక్స్ సోకలేదని, సెరిబ్రల్ మలేరియా కారణంగా ఇబ్బంది పడుతున్నారని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయినా సరే ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. అందులోను తిరుపతి లాంటి ప్రాంతానికి ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు వచ్చి వెళుతుంటారు. దీంతో తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండులలో కూడా భక్తులకు అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హౌజ్‌ఫుల్-4 సెట్స్‌లో అలా జరిగిందా?