మాజీ టిటిడి ఛైర్మన్ చదలవాడక్రిష్ణమూర్తి జనసేన పార్టీలో చేరిక టిడిపి - జనసేనల మధ్య అగ్గి రాజేసింది. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన చదలవాడ ఆ తరువాత టిడిపి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే సుగుణమ్మను టార్గెట్ చేస్తూ చదలవాడ చేసిన వ్యాఖ్యలు తిరుపతిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
తిరుపతిలో టిడిపి - జనసేనపార్టీ నేతల మధ్య రోజురోజుకు పోరు శృతిమించుతోంది. తాజాగా టిడిపి సీనియర్ నేత చదలవాడ క్రిష్ణమూర్తి జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీలో చేరిన తరువాత చదలవాడ క్రిష్ణమూర్తి టిడిపి నేతలపై మాటల దాడికి దిగారు. సీనియర్ నేతగా పార్టీలో తనకు అవమానమే మిగిలిందని ఆరోపించారు. కనీసం పార్టీ వాల్ పోస్టర్‌లోను తన ఫోటో పెట్టకుండా ఎమ్మెల్యే సుగుణమ్మ అడ్డుకుంటోందని విమర్సించారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే సుగుణమ్మ అవినీతి, అక్రమాలపై సిట్ విచారణ చేయాలంటూ చదలవాడ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. తిరుపతి నగరంలో అనేక ఎకరాలను ఎమ్మెల్యే సుగుణమ్మ భర్త, దివంగత నేత వెంకరమణ కబ్జా చేశారని, ప్రస్తుతం కూడా ఆ కుటుంబం అనేక అవినీతి వ్యవహారాలు నడుపుతోందని విమర్సించారు. ఎమ్మెల్యే కోటాలో శ్రీవారి దర్సన టిక్కెట్లను బ్లాక్‌లో సుగుణమ్మ విక్రయిస్తున్నట్లు ఆరోపించారు చదలవాడ. అయితే అనూహ్యంగా చదలవాడ టిడిపిపై విరుచుకుపడడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో చదలవాడ చేసిన ఆరోపణలపై ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండించారు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ఇతర టిడిపి నేతలు. చదలవాడ ఏ మాత్రం విశ్వాసం లేని వ్యక్తని, పార్టీలో కీలకమైన టిటిడి ఛైర్మన్ పదవిని కట్టబెట్టినప్పటికీ తెలుగుదేశంపార్టీపైనే చదలవాడ ఆరోపణలు చేయడం విచారకరమంటూ సుగుణమ్మ విమర్సించారు.
ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిన చదలవాడకు నైతిక విలువలు లేవని ఆరోపించారు. ఇంతకాలం పార్టీలో ఉండి మరోపార్టీలో చేరగానే టిడిపిపై విమర్సలు చేయడం తగదన్నారు. మరొకరిపై అవినీతి ఆరోపణలు చేసే చదలవాడ గురించి అందరికీ తెలుసునన్నారు సుగుణమ్మ. ప్రస్తుతం చదలవాడ నడుపుతున్న క్రిష్ణతేజ విద్యాసంస్ధలు అక్రమంగా పొందినవేనని చెప్పుకొచ్చారు. చదలవాడ అవినీతి చరిత్ర తిరుపతి నగరంలో అందరికీ తెలుసునని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే సుగుణమ్మ.
ఇదిలా ఉంటే తాజాగా జనసేన - టిడిపి మధ్య జరుగుతున్న మాటల దాడి తిరుపతి రాజకీయాలను హీట్ ఎక్కిస్తోంది. మరోవైపు పరిణామాలను వైసిపి నిశితంగా గమనిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్నారు చదలవాడ. తిరుపతిలో విజయాన్ని నిర్ధేశించే కీలకమైన సామాజిక వర్గానికి చెందిన ఇరువురి నేతల మధ్య వైరం ఆశక్తికరంగా మారుతోంది. చదలవాడతో పాటు సుగుణమ్మ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ ఓటర్లు ఎవరివైపు మ్రొగ్గుతారనేది కొత్త చర్చను రేపుతోంది. అయితే చదలవాడ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసమే జనసేనపార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు తిరుపతి తరపున అభ్యర్థిగా పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు.
ఈయన కూడా బలిజ సామాజిక వర్గ నేత కావడం గమనార్హం. ప్రస్తుతం జనసేన మీడియా ఇన్‌ఛార్జ్‌గా హరిప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అధినేత దృష్టిలో పడడానికే టిడిపిపైన, ఆ పార్టీ నేతలపైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చదలవాడ వ్యవహరిస్తున్న తీరు ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు తెచ్చేలా చేస్తుందో లేదో వేచి చూడాలి.