Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ సర్కార్ మరో ఝలక్... గగ్గోలు పెడుతున్న మందుబాబులు

జగన్ సర్కార్ మరో ఝలక్...  గగ్గోలు పెడుతున్న మందుబాబులు
, సోమవారం, 25 నవంబరు 2019 (19:05 IST)
మందుబాబులకు జగన్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచే సింది. క్వార్టర్ బాటిల్ పైన 40... పుల్ బాటిల్ పైన 160... బీరుపై 40 రూపాయలు పెరిగింది. మరోవైపు, బార్ల సంఖ్యలో భారీగా కోత పెట్టేసింది. డిశంబర్ నెలాఖరు నాటికి 40 శాతం బార్లు మూతపడనున్నాయి. దీంతో లైసెన్స్ ఫీజులు కట్టి వ్యాపారాలు ప్రారంభించిన సిండికేట్లు గగ్గోలు పెడుతున్నారు. 
సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. 
 
నెలరోజుల వ్యవధిలోనే మద్యం ధరలను మళ్ళీ భారీగా పెంచేసింది. కొత్త ధరలు బార్లు, స్టార్ హోటళ్ళలో జరిగే అమ్మకాలను పరిమితం చేసింది. దీంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న వైన్ షాపులకు... బార్లలో జరుగుతున్న లిక్కర్ సేల్స్‌కు మద్య వ్యత్యాసం గణనీయంగా పెరిగింది. నెల రోజుల కిందటే క్వార్టర్‌పై రూ.20 చొప్పున పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ధరలను పెంచేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దీంతో మందుబాబులు బార్లకు తరలిపోతుండటంతో అక్కడ రద్దీ పెరిగిపోయింది. 
 
దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బార్లకు తాకిడి తగ్గించేలా బార్లలో విక్రయించే మద్యం ధరలను భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల బ్రాండ్‌ల మద్యం క్వార్టర్‌ బాటిల్‌పై రూ.40 పెంచగా, హాఫ్‌ బాటిల్‌పై రూ.80, ఫుల్‌బాటిల్‌పై రూ.160 పెరిగింది. బీర్లు ధరలకు కూడా అన్ని బ్రాండ్లపై రూ.40 పెరిగింది. నెల రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచినపుడు డీఎస్పీ క్వార్టర్‌ రూ.100 నుంచి రూ.120కి పెరిగితే తాజాగా రూ.160కి పెరిగింది. ఓసీ క్వార్టర్‌పై రూ.110 నుంచి రూ.130కి పెరగ్గా తాజాగా రూ.170కి పెరిగింది. 
 
ఓల్డ్‌ చెఫ్‌ రూ.80 నుంచి రూ.100కి పెరగ్గా, తాజా పెరుగుదలతో రూ.140కి చేరింది. ఐబీ బ్రాండ్‌ రూ.130 నుంచి రూ.150కి పెరగ్గా, తాజాగా రూ.190కి చేరింది. బ్లెండర్‌ స్ర్పెడ్‌ బ్రాండ్‌ క్వార్టర్‌పై రూ.280 నుంచి రూ.300కి పెరగ్గా, రూ.340కి చేరింది. ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర సమయపాలన విధించడం.... అక్కడ కూర్చుని మందు తాగే అవకాశం లేకపోవడంతో.... బార్లకు అలవాటు పడ్డ మందుబాబులకు సర్కార్ నిర్ణయం కరెంట్ షాక్‌లా తగిలింది. పెరిగిన ధరలను కేవలం బార్లకే పరిమితం చేయగా.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధర మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. 
 
బార్లలో మద్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వైపు దృష్టి సారించడంతో అక్కడ భారీగా క్యూ కడుతున్నారు. ప్రైవేట్ మద్యం షాపులను రద్దు చేసిన నెలల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల సమీక్షకు సిద్ధమైంది. ఈ ఏడాది జూలై నెలలో సుమారు 37లక్షల రూపాయలు చెల్లించి లైసెన్సులు పొందిన బార్ల నిర్వహకులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బార్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించిన నేపథ్యంలో నోటీసులు జారీ చేస్తోంది. దీని ప్రకారం డిశంబర్ 31 నాటికి ప్రస్తుతం వున్న బార్ల లైసెన్సులు రద్దైపోతాయి. కొత్తగా ఎలాంటి విధానం అనుసరిస్తారనే స్పష్టత ఇప్పటి వరకూ ఆబ్కారీ అధికారులకు లేదు. 
 
మరోవైపు, స్కూళ్ళు, ఆలయాలు, జాతీయ రహదారులకు సమీపంలో వైన్ షాపులు వుండరాదన్న నిబంధనను బార్లకు పూర్తిస్ధాయిలో వర్తింప చేస్తే అధిక సంఖ్యలో మూతపడే అవకాశం వుంది. గ్రేటర్ విశాఖ నగరం పరిధిలో సుమారు 40 బార్లకు తాళాలు వేసుకోవాల్సి వస్తుందని నిర్వహకులు గగ్గోలు పెడుతున్నారు. మరో ఆరునెలలు లైసెన్స్ గడువు వుండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్ధానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరల కంటే బార్ల నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనివల్ల మందుబాబుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెంచిన ధరల కంటే క్వార్టర్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.80, బీరుపై రూ.20 నుంచి రూ.40 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. బార్లకు ఆ మేరకు పెంచుకునే వెసులుబాటు ఉండడంతో ఎక్సైజ్‌ అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి వీల్లేకుండా పోతోంది. బార్ల సంఖ్యను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిర్వహకులకు ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. డిశంబర్ 31 నాటికి బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికి మిగిలి వున్న ఆరునెలల కాలానికి లైసెన్స్ కింద చెల్లించిన ఫీజులను తిరిగి చెల్లించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల ఉసురు పోసుకుంటున్న సర్కారు : ఏ కోదండరెడ్డి