Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలిపిరి నడక దారిలో చిక్కిన మరో చిరుత...

Leopard
, గురువారం, 17 ఆగస్టు 2023 (08:25 IST)
తిరుమల కొండల్లో మరో చిరుత చిక్కింది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ, తితిదే అధికారులు తెలిపారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటుచేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బోనులో ఓ చిరుత చిక్కగా.. తాజాగా గురువారం వేకువజామున మరో చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను బంధించినట్లు చెప్పారు. మరో మూడు చిరుతలు సంచరిస్తున్నట్టు సమాచారం. 
 
మా పాప ఖరీదు రూ.10 లక్షలా? 
 
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి దాడి కేసులో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తమ కుమారుడికి వెంట్రుకలు తీసుకునేందుకు తిరుమలకు నడిచి వెళుతుండగా, చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, మృతురాలి కుటుంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు రూ.10 లక్షల ఆర్థికసాయం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వీటిపై లక్షిత తాత శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. అసలే బిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మా పాప ప్రాణంఖరీదు రూ.10 లక్షలుగా నిర్ణయించారని, అయినా మాకు ఎవరి సాయం అక్కర్లేదని ఆయన తేల్చి చెప్పారు.
 
తిరుమల కొండలపై జింకలకు ఇచ్చే రక్షణ భక్తులకు లేదన్నారు. జింకలను స్వేచ్ఛగా వదిలితేనే చిరుతలు, పులులు మనుషుల వైపు రావని ఆయన అన్నారు. జింకలను ఎందుకు బంధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పులుల సంచారం ఉన్నట్టు పత్రికల్లో నిరంతరం వార్తలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. కంచె వేసివుంటే బిడ్డ ప్రాణాలతో ఉండేదని బోరున విలపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ఆయన కోరారు. నాయకులు వస్తే భద్రత కల్పిస్తారని, మాలాంటి సాధారణ భక్తుల మానప్రాణాలకు రక్షణ ఎక్కడ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో చెత్తబుట్టలో రూ.24.92 లక్షల విలువైన బంగారం