అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.15000 కోట్లు సాయం సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలు ఉపయోగిస్తూ వేగంగా జంగిల్ క్లియరెన్స్ జరుపుతోంది.
భారీ మానులను సైతం అమరావతిలో వినియోగిస్తున్న టబ్ గ్రైండర్ యంత్రాలు పిండి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీడీపీ కూటమి సర్కారు.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది.
త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్నం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
నాలుగు ప్రధాన నగరాలను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిని కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే పాతికేళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.