Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌ శాంతి భద్రతలు క్షీణించాయి.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ శాంతి భద్రతలు క్షీణించాయి.. చంద్రబాబు
, గురువారం, 26 సెప్టెంబరు 2019 (08:04 IST)
ఆంధ్రప్రదేశ్‌  శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారుతోందని, రాష్ట్రం అరాచకం అంచుల్లోకి వెళ్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు.

రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండాపోతోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేసే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. "చీరాలలో పాత్రికేయుడు, సామాజిక ఉద్యమ కార్యకర్త ఎన్‌. నాగార్జునరెడ్డి తనకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కుటుంబం నుంచి ప్రాణ హాని ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీకి ఈ నెల 23న ఫిర్యాదు చేశారు.

ఎస్పీని కలిసి తిరిగి వస్తుంటే అదే రోజు ఆయన్ను కిడ్నాప్‌ చేసి తీవ్రంగా కొట్టి గాయపర్చి రోడ్డు మీద పారవేసిపోయారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. సాధారణ ప్రజలు, పాత్రికేయులు, మీడియా సంస్థలపై తరచూ దాడులు జరుగుతున్నాయి.

రాష్ట్రంలోని కేబుల్‌ ఎమ్మెస్వోలను వైసీపీ నేతలు బెదిరించి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్లు ప్రసారం కాకుండా నిలిపివేశారు. పాత్రికేయులను, సామాజిక కార్యకర్తలను అధికార పార్టీ నేతలు బెదిరించడం, దాడులు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది.

గతంలో రాష్ట్ర పోలీసులు నిష్పాక్షిక విధి నిర్వహణకు, సమర్థ పోలీసింగ్‌కు పేరు మోశారు.. కానీ గత 3-4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తంచేశారు.
 
"వారి తరపున పోరాడుతున్న టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని పోరాడే టీడీపీ నేతలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కన్నా దారుణం మరొకటి లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు 12 మందిపై అక్రమ కేసులు బనాయించారు.

అచ్చెన్నాయుడిపై తాడేపల్లిలో, టెక్కలిలో కేసులు పెట్టారు. నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, 43 ఏళ్ల కిందటి అంశంపై మాజీ మంత్రి సోమిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు" అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 
వైసీపీయేతర పార్టీలవారు ఇచ్చిన ఫిర్యాదులను నమోదు చేయకపోవడం, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడం, సోషల్‌ మీడియా పేరుతో సామాన్యులపై కేసులు నమోదు చేసి వేధించడం వంటివి రాష్ట్రంలో పోలీసుల విధి నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయని తెలిపారు.

‘సత్యమేవ జయతే అన్నది పోలీసు శాఖ నినాదం. దీనిని నిలబెట్టుకోవడానికి ఆ శాఖ నిజాయితీగా పనిచేసి ప్రతిష్ఠను నిలుపుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీనివల్ల శాంతి భద్రతలు మెరుగుపడి పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయి’ అని డీజీపీకి సూచించారు. కర్నూలు జిల్లా కోడమూరు టీడీపీ ఇన్‌ఛార్జి విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్టును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

పవిత్రమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఓ ప్రకటనలో మండిపడ్డారు. విష్ణువర్ధన్‌రెడ్డికి సంఘీభావంగా టీడీపీ నేతల బృందం శుక్రవారం కర్నూలు వెళ్లాలని ఆదేశించారు. ఈ బృందంలో కాల్వ శ్రీనివాసులు, తిప్పేస్వామి, చెంగల్రాయుడు తదితరులు ఉంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో త్వరలో నీరా స్టాల్స్ : మంత్రి శ్రీనివాస గౌడ్