Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుర్రం పైన స్కూల్‌కి వెళ్తున్న గురువును ప్రభుత్వం గుర్తించింది...

Advertiesment
గుర్రం పైన స్కూల్‌కి వెళ్తున్న గురువును ప్రభుత్వం గుర్తించింది...
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (14:02 IST)
గుర్రం పైన స్కూల్‌కి వెళ్తున్న గురువును ప్రభుత్వం గుర్తించింది... నిబద్ధతకు మెచ్చి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. భౌగోళికంగా ఇబ్బందికరంగా వుండే విశాఖ మన్యంలో గిరిజన విద్యార్థులకు విద్యా బోధన చెయ్యాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. మండల కేంద్రాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం గిరిజన ప్రాంతంలో ఉద్యోగం చెయ్యడానికి ససేమిరా అంటారు. కానీ గిరిజన ప్రాంతంలో పుట్టి సాటి గిరిజనుడైన ఓ మాష్టర్ దృఢ సంకల్పం అక్కడి బడి పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపింది. 
 
విశాఖ జిల్లా జి.మాడుగుల సుర్లోపాలెం టీచర్ గంపరాయి వెంకటరమణ అలియాస్ గుర్రం మాష్టర్ మాత్రం ఎన్నికష్టాలు ఎదురైనా గిరిబిడ్డల విద్య కోసం రాజీపడ లేదు. 52 మంది విద్యార్ధులున్న సుర్లోపాలెం స్కూల్‌కి చేరాలంటే... పాడేరు మండల కేంద్రం నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. అందులో సగ దూరం బైక్ పైన వెళ్లినా మిగతా దూరం అధిగమించాలంటే కాళ్లకు పని చెప్పాల్సిందే. ఇతనికి ఉన్న సమయం అంతా ప్రయాణంలో సరిపోతుండటంతో పిల్లలకు విద్యా బోధన కష్టతరంగా మారింది.
 
దీంతో వెంకట రమణ మాష్టారు ఓ గుర్రాన్ని ఆశ్రయించాడు. ఇది గమనించిన గ్రామస్తులు సైతం ఆ మాస్టర్‌కి ఏకంగా ఓ గుర్రాన్ని కొని ఇచ్చారు. అక్కడి నుండి ఆ మాస్టర్ గుర్రంపై వెళ్లి విద్యాబోధన చేసి వస్తుంటారు. ఇదంతా గమనించిన ప్రభుత్వం ఆయన ప్రతిభ గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కరించనుంది. సాటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా మారిన గుర్రం మాస్టర్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని కోరుకుందాం...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ సర్చ్ ఇంజిన్‌తో జాగ్రత్త.. మొత్తం డేటా రికార్డ్ అవుతుద్ది..