Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Advertiesment
వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
, గురువారం, 31 అక్టోబరు 2019 (21:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. మరికొన్ని గంటల వ్యవధిలో నగరంలోని ఇందిరా గాంధీ నగర పాలక సంస్ధ క్రీడా ప్రాంగణం వేదికగా మూడు రోజుల కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా, పర్యాటక భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు విశేష ఏర్పాట్లు చేసింది. 
 
మరోవైపు జిల్లా యంత్రాంగం కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల నేపధ్యంలో భారతావనికి స్వేఛ్చా వాయువులు ప్రసాదించటంలో కీలక భూమికను పోషించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోనున్నారు. వారికి నివాళి అర్పించటంతో పాటు, దివంగత సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా సత్కారం చేయనున్నారు. రాష్ట్ర పధమ పౌరుడు బిశ్వ భూషణ్ హరిచందన్, రాష్ట్రాధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల చేతుల మీదుగా వీరు గౌరవాన్ని అందుకోనున్నారు.
 
పింగళి వెంకయ్య, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, భోగరాజు పట్టాభి శీతారామయ్య, వావిలాల గోపాల కృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరశింహారెడ్డి, కడప కోటిరెడ్డి, ఆచార్య ఎన్ జి రంగా, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, దుర్గాభాయి దేశ్‌ముఖ్, సురవరం ప్రతాప రెడ్డి, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాధం తదితరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
 
ఈ నేపధ్యంలో వేడుకల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న పర్యటక, భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్యకార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగనుండగా, సభాకార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానుందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చేనేత, హస్త కళల ప్రదర్శన నిర్వహిస్తున్నామని, రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభవేళ నేత కళాకారులు రాయితీలకు కూడా అందించనున్నారని వివరించారు.
 
అదరహో అనిపించేలా తెలుగు సాంప్రదాయక ఆహార ఉత్సత్తుల ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నామని, డ్వాక్రా సంఘాల మొదలు స్టార్ హోటళ్ల వరకు వివిధ స్ధాయిలలో తెలుగు రుచులు సిద్దం కానున్నాయని ప్రవీణ్ కుమార్ వివరించారు. గాంధీజీ 150 జయంతి వేడుకలను సైతం గుర్తుచేసుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాలు, ఛాయా చిత్రాలు, స్టాంపుల ప్రదర్శన ఏర్పాటు చేసామన్నారు. 
 
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు , ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారన్నారని మూడు రోజల పాటు ప్రాంగణంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకతను సంరించుకోనున్నాయని వివరించారు. నవంబరు మూడవ తేదీ వరకు ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్యాలు, సురభి నాటకములు, లలిత సంగీతం, జానపద కళారూపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక అలరించనుందని ముఖ్య కార్యదర్శి  ప్రవీణ్ కుమార్ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివ సైనికుడే మహారాష్ట్రకు సీఎం కానున్నాడు.. ఆ రెండు పార్టీలు టచ్‌లో ఉన్నాయ్... ఉద్ధవ్