Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివ సైనికుడే మహారాష్ట్రకు సీఎం కానున్నాడు.. ఆ రెండు పార్టీలు టచ్‌లో ఉన్నాయ్... ఉద్ధవ్

Advertiesment
శివ సైనికుడే మహారాష్ట్రకు సీఎం కానున్నాడు.. ఆ రెండు పార్టీలు టచ్‌లో ఉన్నాయ్... ఉద్ధవ్
, గురువారం, 31 అక్టోబరు 2019 (20:47 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడే కూర్చొంటారనీ ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అదేసమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు పార్టీలు తమతో టచ్‌లో ఉన్నాయంటూ ఆయన హెచ్చరికలు పంపారు. వీటిపై బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 
 
మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్ర శాసనసభకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమి విజయభేరీ మోగించింది. బీజేపీ సొంతంగా 105 సీట్లు కైవసం చేసుకోగా, శివసేన 56 సీట్లను గెలుచుకుంది. అలాగే, కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ (44), ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష పాత్రను పోషించనున్నాయి. 
 
అయితే, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత శివసేన సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. అధికారాన్ని తలా రెండున్నరేళ్ళ పాటు పంచుకోవాలని, తొలుత సీఎం పదవిని అలంకరించే అవకాశాన్ని తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభనతో పాటు.. ఉత్కంఠ నెలకొంది. 
 
ఇదిలావుంటే, గురువారం జరిగిన శివసేన శాసనసభాపక్ష సమావేశంలో ఏక్‌నాథ్ షిండేను అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా, సునీల్ ప్రభును చీఫ్ విప్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, 'శివ సైనికుడే మహారాష్ట్రకు సీఎం కానున్నాడు' అంటూ బాంబు పేల్చాడు. 
 
ప్రభుత్వం ఏర్పాటుపై తమకు తొందరలేదని చెపుతూ.. మీలో ఎవరికైనా తొందరగా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో సహా, ప్రతీ ఒక్కరూ తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు.
 
'బీజేపీ సమస్య మాకు తెలుసు. అదేవిధంగా మా సమస్యలు వారు తెలుసుకోవాలి. మేము కూడా పార్టీని నడిపించాల్సి ఉంటుంది కదా?' అని ఆయన అన్నారు. మరోవైపు, బీజేపీ, తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎన్నుకుంది. ఈ సందర్భంగా ఆయన సీఎం పదవిపై శివసేనతో ఒప్పందం చేసుకోలేదు అని వ్యాఖ్యానించడం, వీటిని శివసేన తిప్పికొట్టడం జరిగిపోయాయి. 
 
మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన తమతో కలిసి వస్తానంటే, ఎన్సీపీని కూడా ఒప్పించే బాధ్యత తమదేనని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడితే శివసేన తమతో టచ్‌లో ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపొచ్చు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులకు షాకివ్వనున్న కాగ్నిజెంట్... 7 వేల మంది టెక్కీలకు ఉద్వాసన?!