నివర్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. నీరవ్ తుఫాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం, ఆ తర్వాత ఆరు గంటల్లో వాయుగుండం బలహీనపడనుందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా, తుఫాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశించారు. అవసరమైతే తాగునీరు, పారిశుధ్యం పనులు చేపట్టాలన్నారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్ ప్యాకెట్లు తక్షణమే సరఫరా చేయాలన్నారు.