Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.562 కోట్ల ఎస్.ఎస్.ఎ. నిధుల కోసం కేంద్రానికి లేఖ రాస్తా... అనిల్ చంద్ర

రూ.562 కోట్ల ఎస్.ఎస్.ఎ. నిధుల కోసం కేంద్రానికి లేఖ రాస్తా... అనిల్ చంద్ర
, బుధవారం, 14 నవంబరు 2018 (21:05 IST)
అమరావతి : రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం(ఎస్.ఎస్.ఎ.) కింద చేపట్టిన నిర్మాణాలు, పథకాలు సకాలంలో పూర్తికి తరుచూ సమీక్షలు, తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. శిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన రూ.562.58 కోట్ల గురించి త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సమగ్ర సర్వశిక్షా అభియాన్ పథకం అమలు తీరుపై సీఎస్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ముందుగా రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ సంధ్యరాణి... రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం(ఎస్.ఎస్.ఎ.) కింద చేపట్టిన నిర్మాణాలు, విద్యా పథకాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సర్వశిక్షా అభియాన్ ను కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ గా మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 352 కస్తూరిభా గాంధీబాలిక విద్యాలయాలు(కేజీబీవీ) ఉన్నాయని, వాటిలో 71,495 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు. 2017-18 పదో పరీక్షల్లో 99.17 శాతం మేర కేజీబీవీ విద్యార్థినులు ఉత్తీర్ణులు కావడంపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ సంతృప్తి వ్యక్తంచేశారు. 
 
కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయాల ప్రహారీ గోడలు నిర్మాణాల ప్రగతి ఎంతవరకూ వచ్చిందని సీఎస్ ప్రశ్నించారు. 186 కస్తూరిభా గాంధీ బాలిక విద్యాలయాలకు ప్రహారీ గోడలు నిర్మించామని, త్వరలో 152 విద్యాలయాల ప్రహారీ గోడల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎస్.ఎస్.ఎ. ఈఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2018-19 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన రూ.562.58 కోట్లు ఇంకా విడుదల కాలేదని సీఎస్ దృష్టికి రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ సంధ్యరాణి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలన్నారు. 
 
నివేదక రాగానే, నిధుల కోసం త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. సమగ్ర సర్వశిక్షా అభియాన్ పూర్తిస్థాయిలో అమలుకావడానికి తరుచూ సమీక్షలు, తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ సంధ్యరాణిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్.ఎస్.ఏ ఫైనాన్స్ కంట్రోలర్ లక్ష్మీ కుమారి, ఎ.ఎస్.డి.పి.లు కె.నాగేశ్వరరావు, భరత్ కుమార్, ఎస్.ఎ.ఎం.ఓ. పి.విజయలక్ష్మి తదిరతులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే బాలకృష్ణ ''సంకర నా కొ...'' అంటారా? బీ కేర్ ఫుల్: పవన్ వార్నింగ్