Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరెస్ట్ అధిరోహకులకు రూ.10 లక్షల నజరానా... ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం: సీఎం బాబు

అమరావతి: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి.. ఒకే దఫా 14 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించా

ఎవరెస్ట్ అధిరోహకులకు రూ.10 లక్షల నజరానా... ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం: సీఎం బాబు
, గురువారం, 1 జూన్ 2017 (21:47 IST)
అమరావతి: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి.. ఒకే దఫా 14 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించి రాష్ట్రానికి తిరిగొచ్చిన విద్యార్ధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విద్యార్థులు చేసిన సాహసాన్ని తెలుసుకుని అభినందనల వర్షం కురిపించారు. ఈ సాహసంతో రాష్ట్రానికి పేరు సంపాదించిపెట్టడమే కాకుండా ప్రపంచ చరిత్రలో మిగిలిపోయే రికార్డును సృష్టించిన 14 మంది విద్యార్థులతో పాటు, కోచ్ శేఖర్ బాబుకు కూడా 10 లక్షల రూపాయల వంతున ప్రభుత్వ కానుకగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
 
విద్యార్థులు చేసిన ఈ సాహసయాత్ర ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా తల వంచిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సాంఘిక సంక్షేమం, గిరిజన, యువజన సర్వీసుల విభాగాల నుంచి మొత్తం 65 మందిని ఎంపిక చేయగా 30 మందిని వడపోసి.. వారిలో 19 మంది సాహసయాత్ర ప్రారంభించారు. వీరిలో 14 మంది సాహసయాత్ర పూర్తి చేయగా క్లిష్ట పరిస్థితుల్లో వెనుదిరిగిన ఐదుగురు విద్యార్థులకు కూడా ఐదేసి లక్షల రూపాయల వంతున నగదు బహుమతి అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భావితరాలకు తిరుగులేని స్ఫూర్తిని కలిగిన ఈ విద్యార్ధులకు.. ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో కూడా తగిన ప్రాధాన్యతనిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 
 
ఈ సాహసయాత్ర కోసం విద్యార్ధులపై రెండు కోట్ల 75 లక్షల రూపాయలు ఖర్చు పెడితే.. 275 కోట్ల రూపాయల విలువైన ధైర్యం, సాహసం చూపించారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రోత్సాహం, పట్టుదల, కష్టపడేతత్వం ఉంటే.. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించొచ్చని ఈ విద్యార్ధులు నిరూపించారని.. వీరిని ఆదర్శంగా తీసుకుని.. మరింత మంది విద్యార్ధులు.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సాహసయాత్రకు వెళ్లిన విద్యార్ధుల బృందంలో బాలికలు కూడా ఉండటంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో.. పేద కుటుంబాల్లో జన్మించినప్పటికీ.. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో.. ఎవరెస్ట్ పై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన విద్యార్ధుల సాహసయాత్ర అద్భుతమన్నారు. 
 
చుట్టూ మంచుకొండలు, మైనస్ 60 డిగ్రీలకు పైగా చలి గాలుల వీచే క్లిష్ట పరిస్థితుల్లో కొందరు మధ్యలోనే విరమించుకుంటున్నా మరికొందరు చనిపోతున్నా లెక్క చేయకుండా యాత్రను పూర్తి చేసిన విద్యార్ధుల ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానన్నారు. ఇలాంటి సాహసాలు చేస్తే మనోధైర్యం పెరుగుతుందని ఉన్నతస్థాయిలకు ఎదగాలన్న తపన పెంచుతుందని ఇలాంటి తపనతోనే జీవితంలోనూ మరిన్ని ఉన్నతస్థానాలకు ఎదగాలని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా.. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే క్రమంలో విద్యార్ధులు ఎదుర్కొన్న అనుభవాలు, ఇబ్బందులు, ఆ సమయంలో వారి మానసిక స్థితిగతుల గురించి విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా సంధ్యాబాయి అనే విద్యార్ధిని మాట్లాడుతూ.. తమకన్నా ముందు సీనియర్ విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని.. ఈ సాహసయాత్రకు వెళ్లినట్టు తెలిపింది. ఈ యాత్రతో తనపై తనకు నమ్మకం పెరిగిందని.. చదువుల్లో కూడా రాణించడం ద్వారా ఐపీఎస్ కావాలనుకుంటున్నానని తెలిపింది. మరో విద్యార్ధిని రాణి కూడా ఈ సాహసయాత్రను ఏ మాత్రం భయపడకుండా పూర్తి చేశామని.. తాను కూడా భవిష్యత్తుల ఐపీఎస్ కావాలనుకుంటున్నానని తెలిపింది. సురేష్ బాబు, తుకారం అనే విద్యార్ధులు కూడా తమ అనుభవాలను పంచుకోగా.. ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన చెన్నారావు మాట్లాడుతూ.. చలిగాలులకు తట్టుకోలేక కొంతమంది విరమించుకున్నా.. మరికొందరు చనిపోయిన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి కూడా.. ఆ క్లిష్ట పరిస్థితులను అధిగమించి యాత్రను పూర్తి చేయడం మరిచిపోలేని అనుభవమన్నాడు.
 
సాంఘిక, గిరిజన సంక్షేమశాఖా మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. విద్యార్ధులు చేసిన ఈ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. మరింత మంది విద్యార్ధులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. యువజన వ్యవహారాలశాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులు.. తెలుగు విద్యార్ధి ఔన్యత్యాన్ని చాటారని పేర్కొన్నారు. విద్యార్ధుల సాహసయాత్రకు ప్రభుత్వం ఆర్ధికంగా చేయూతనిచ్చినప్పటికీ.. విద్యార్ధులు పడిన కష్టం తిరుగులేనిదన్నారు. ఈ సాహసయాత్ర ద్వారా.. తెలుగు విద్యార్ధి సత్తా ఏంటన్నది ప్రపంచానికి చాటారని అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్‌తో పాటు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధుల తల్లిదండ్రులు, సాంఘిక, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసు శాఖల ఉన్నతాధికారులు శిశోడియా, రావత్, వాసు, రాములు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే... టర్మ్ ఇన్సూరెన్స్‌తో భద్రత...