కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులు చిక్కుకునిపోయారు. ఇలాంటి వారు తిరిగి తమతమ సొంతూళ్ళకు చేరుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇలాంటి వారిని తరలించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా శ్రామిక్ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కూలీలు, కార్మికుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలు, కార్మికుల కోసం వీటిని జారీచేసింది. అలాగే, సంబంధిత అధికారులకు కూడా కీలక సూచనలు చేసింది. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
* రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు 1902 అనే ఫోను నంబరుకు కాల్ చేసి, తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి.
* శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించి, వారికి నెగెటివ్ అని వస్తేనే బస్సులో తరలించారు. అదీకూడా ఒక బస్సులో 50 శాతానికి మించకుండా చూడాలి.
* స్వగ్రామానికి చేరుకున్న అనంతరం కూలీలు అక్కడ మరోసారి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. అక్కడ ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ బృందం మొత్తాన్ని అక్కడే ఉంచాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
* ఇకపోతే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి. ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వారిని రాష్ట్రానికి తీసుకొచ్చి, అక్కడ నుంచి సొంతూర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.