ఏపీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో నాలుగో నిందితుడుగా అరెస్టయిన వైకాపా ఎంపీ, మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, జైలులో ఆయనకు లగ్జరీ సౌకర్యాలు కల్పించాలంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఉదయం వేళ అల్పాహారం, రెండు పూటలా ఇంటి భోజనం, కిన్లే వాటర్, కొత్త పరుపు, దిండు, దోమతెర, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, వాకింగ్ షూ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
జైల్లో తనకు ఈ ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు ప్రొటీన్ పౌడర్, ఓ టేబుల్ దానిపై తెల్లకాగితం, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్‌లపై విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. మంగళవారం ఉదయం నేరుగా కోర్టుకు హాజరై అభ్యంతరాలు చెప్పాలని నిర్ధేశించింది.