Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పల్లె పంచాయతీ : కొరఢా ఝుళిపిస్తున్న ఈసీ.. ఇద్దరు కలెక్టర్లు ఔట్!

Advertiesment
ఏపీలో పల్లె పంచాయతీ : కొరఢా ఝుళిపిస్తున్న ఈసీ.. ఇద్దరు కలెక్టర్లు ఔట్!
, బుధవారం, 27 జనవరి 2021 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలోకి దిగారు. తనకున్న విస్తృత అధికారాలను పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు. ఫలితంగా తనను ధిక్కరించిన, రాజ్యాంగాన్ని ధిక్కరించి, ఎన్నికల సంఘానికి సహకరించని వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌లను బదిలీ చేసింది. వారు జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రస్తుతానికి చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌ డి.మార్కండేయులు, గుంటూరు జాయుంట్‌ కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌కు పూర్తిస్థాయి కలెక్టర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 
 
తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఎ.రమేశ్‌ రెడ్డిని కూడా బదిలీ చేశారు. ఆయన్నూ జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. 
 
ప్రభుత్వ ఆదేశాలు వెలువడక ముందే చిత్తూరు కలెక్టర్‌ భరత్‌ గుప్తా మంగళవారం రాత్రే బాధ్యతలను జేసీకి అప్పగించి రిలీవయ్యారు. కాగా.. ప్రభుత్వం పంపే జాబితా ఆధారంగా ఆ రెండు జిల్లాలకు ఎన్నికల సంఘం సూచన మేరకు కొత్త కలెక్టర్లను, తిరుపతి అర్బన్‌ ఎస్పీని నియమించనున్నారు. దీనిపై రేపోమాపో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
 
మరోవైపు, బుధవారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఉదయం 10:15 గంటలకు గవర్నర్‌ను ఎస్‌ఈసీ కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను ఎస్‌ఈసీ వివరించనున్నారు. అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణ చర్యల గురించి గవర్నర్‌కు ఎస్‌ఈసీ తెలపనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధీ, జ్ఞానం ఉన్న సీఎం అయితే సుప్రీంకోర్టుకు వెళతారా? చంద్రబాబు