ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఆస్తి పంపకం విషయంలో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో ఓ కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీంతో రామకృష్ణమ్మ, ఆమె కుమారుడు వేణుగోపాల్, సోదరులు మోహన్, సోమశేఖర్ మంగళవారం రాత్రి ఊరి శ్మశానం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎలుకల మందును, సూపర్ వాస్మోల్ 33లో కలుపుకుని తాగడంతో అపస్మారకస్థితిలోకి జారుకున్నారు.
బుధవారం ఉదయం క్రమంలో ఉదయం గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన కాపరి వీరిని చూసి పోలీసులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు వీరిని హుటాహుటిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మోహన్, సోమశేఖర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
రామకృష్ణమ్మ, వేణుగోపాల్‌ల పరిస్థితి విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు