Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బో.. సీఎం జగన్ పాలన గురించి ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... మంత్రి అమిత్ షాపై సెటైర్లు

shah - jagan
, ఆదివారం, 11 జూన్ 2023 (22:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించడంపై ప్రతి ఒక్కరూ ఔరా అంటూ నోటిపై వేలేసుకుంటున్నారు. ఏపీలోని జగన్ పాలన అంతా అవినీతిమయం అంటూ ఆదివారం సాయంత్రం వైజాగ్ వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. 
 
గత నాలుగేళ్లుగా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్ని అరాచకాలకు, అడ్డుగోలు పనులకు, రాష్ట్ర విధ్వంసానికి, అనైతిక చర్యలకు, బ్రిటిష్ కాలం నాటి చట్టాల అమలకు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులను రక్షించేందుకు, అడ్డుగోలు అప్పులకు ఇలా ఏ విధంగా సాయం చేయగలమో అన్నీ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందనే విమర్శలు లేకపోలేదు. ఒక్క విధంగా చెప్పాలంటే సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, హోం అమిత్ షాలు కుడిఎడమ భుజాలుగా వ్యవహరించారని ఏపీ ప్రజల మనసుల్లోని మాట. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారనీ, ఈ కేసులో ఏ8 నిందితుడు కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు కాకుండా కేంద్రంలోని ఓ అదృశ్య శక్తి రక్షిస్తూ వస్తుందన్నది ప్రజలు చర్చించుకుంటున్న బహిరంగ రహస్యం. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం విశాఖకు వచ్చిన అమిత్ షా... సీఎం జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయం అంటూ వ్యాఖ్యానించడం ఆయన ఊసరవెల్లితనానికి నిదర్శనంగా చెప్తున్నారు. ఈ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపని జగన్ సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న ఇళ్లకు జగన్ పేరు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఇస్తున్న ఉచిత బియ్యం పథకానికి జగన్ ఫోటోనా అని ప్రశ్నించారు. వైకాపా వచ్చాక విశాఖ నగరం అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. 
 
గత తొమ్మిదేళ్ల కాలంలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. మైనింగ్, మాఫియా, గుంజాయికి అడ్డాగా ఏపీ మారిందన్నారు. అమరావతి, విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీలు చేస్తున్నామన్నారు. గత నాలుగేళ్లుగా సీఎం జగన్‌కు కేంద్ర హోం మంత్రిగా, బీజేపీలో కీలక నేతగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న అమిత్ షా.. విశాఖ వేదికగా జగన్‌పై దుమ్మెత్తి చేయడం వింతగానూ, విచిత్రంగా ఉందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఈ రాజకీయ నేతలకే చెల్లుబాటు అవుతుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహనాగ వద్ద మరమ్మతు పనులు.. 15 రైళ్లు రద్దు