ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ మళ్లీ రగులుతోంది. మహిళలు, పిల్లలతో సహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకొని గ్రామాలపై దాడులు చేయాలన్న మణిపూర్ వేర్పాటు వాదుల కుట్రను సైన్యం బహిర్గతం చేసింది. మణిపుర్‌లో హింసే లక్ష్యంగా వేర్పాటు వాదులు ఈ కుట్రను పన్నినట్లు సైన్యం గుర్తించింది.
మరోవైపు, మణిపూర్‌లో ఆదివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కొండ ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన సాయుధులైన కుకీ మిలిటెంట్లు లోయల్లోని మేతీ తెగకు చెందిన 8 గ్రామాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు సహా ఐదుగురు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. మరోవైపు ఆయుధాలతో తిరుగుతున్న 40 మంది కుకీ మిలిటెంట్లను భద్రతా బలగాలు ఇప్పటివరకూ కాల్చి చంపాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు.
భారత సైన్యం ముగ్గురు వేర్పాటువాదులను అరెస్టు చేసింది. వీరి వద్ద ఇన్సాస్ రైఫిల్, మ్యాగ్జైన్, ఆరు రౌండ్ల తూటాలు, ఓ చైనా గ్రనేడ్, డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. తూర్పు ఇంఫాల్‌లోని చెకున్‌లో వీరిని అరెస్టు చేశారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించనున్నారు.