Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయసాయి పుట్టిన రోజుకు రూ.307 కోట్లు బహుమతి : చంద్రబాబు

Advertiesment
విజయసాయి పుట్టిన రోజుకు రూ.307 కోట్లు బహుమతి : చంద్రబాబు
, గురువారం, 2 జులై 2020 (14:03 IST)
వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పుట్టిన రోజుకు ఆయన అల్లుడు ఇచ్చిన బహుమతి విలువ రూ.307 కోట్లు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఒకేసారి 1088 అంబులెన్స్‌లను సీఎం జగన్ విజయవాడలో ప్రారంభించిన విషయం తెల్సిందే. దీనిపై చంద్రబాబునాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. జూలై 1 విజయసాయిరెడ్డి పుట్టినరోజు అని, ఆయనకు పుట్టినరోజు నాడు ఇన్ని అంబులెన్స్‌లతో కానుక ఇచ్చారని, అంబులెన్స్‌ల వ్యవహారంలో 307 కోట్ల మేర కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. 
 
విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థకు అంబులెన్స్‌ల నిర్వహణ అప్పగించారని మండిపడ్డారు. మీకు కావాల్సిన వాళ్ల కోసం వాహనాలు ఇచ్చేందుకు ఇంత షో చేస్తారా? ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడతారా? అంటూ ప్రశ్నించారు. 
 
తాము గతంలోనే 1500 అంబులెన్స్‌లు ఇచ్చామని, వాటిలోనూ అత్యాధునిక సౌకర్యాలున్నాయని వివరించారు. ఇవాళ పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప వైసీపీ సర్కారు కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. 
 
ఇకపోతే, పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి విషయంలో మానవ హక్కులు ఉల్లంఘించడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని అన్నారు. ఒక వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకుంటే అతడిని ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా, ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడి విషయంలో భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించిందని తెలిపారు. 
 
"అచ్చెన్నాయుడు ఏమైనా టెర్రరిస్టా? లేక దొంగా? ఎక్కడికి పారిపోతాడు? గోడలు దూకి వెళ్లి అరెస్ట్ చేయాలా? తనకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా 600 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దాంతో గాయం తిరగబెట్టింది. రెండోసారి కూడా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఆసుపత్రిలోనూ డ్రామాలు ఆడారు. తనకు అనారోగ్యంగా ఉందన్నా గానీ, కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంచినా గానీ, డిశ్చార్జి చేశారు. వీల్ చెయిర్‌లో బయటికి తీసుకొచ్చి, అంబులెన్స్‌లో ఎక్కించుకుని జైలుకి తీసుకెళ్లారు. పైశాచిక ఆనందం తప్ప ఇది మరొకటి కాదు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 1 నుంచి ఆధార్ కీలకం... పాస్‌పోర్ట్‌కు ఆధార్ నెంబర్ కంపల్సరీ