ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పిస్తుందని గుర్తు చేశారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని మరోసారి ప్రస్తావించారు.
విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్ విద్యాసంస్థలు విలీనం చేస్తే.. వారి పేర్లు అలాగే కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. స్వతంత్రంగా నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే తమ ఉద్దేశమని, ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని సీఎం జగన్ స్పష్టం చేశారు.