Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాపట్లకు వ్యవసాయ వర్సిటీ?!.. ముమ్మరంగా యత్నాలు

Advertiesment
బాపట్లకు వ్యవసాయ వర్సిటీ?!.. ముమ్మరంగా యత్నాలు
, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:06 IST)
గుంటూరు లాంలో వున్న ఆచార ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బాపట్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా?... ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇది జరుగుతోందా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. యూనివర్సిటీని తరలించే విషయమై ప్రభుత్వానికి, ఆ వర్సిటీ ఉపకులపతికి మధ్య రేగిన రగడే ఇందుకు తార్కాణమని చెబుతున్నాయి.

అగ్రి యూనివర్సిటీని బాపట్లకు తరలించాలని కోరుతూ బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖలను సర్క్యులేట్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖకు ఆదేశాలు వచ్చాయి.

ఇందులో భాగంగా అగ్రి యూనివర్సిటీ వీసీని సాధ్యాసాధ్యాలు, ఇతర వివరాలను వ్యవసాయ శాఖ కోరింది. దీనిపై అగ్రి యూనివర్సిటీ వీసీ నివేదిక సిద్ధం చేశారు. అగ్రి యూనివర్సిటీని లాం నుంచి తరలించడం సమంజసం కాదని ఆయన అందులో పేర్కొన్నారు. దీనికి ఆయన పలు కారణాలు చెప్పారు.

ఈ వర్సిటీ రాష్ట్రం మధ్యలో ఉంటుంది. దాని ఏర్పాటుకు గుర్తించిన భూమిపై ఎలాంటి వివాదాలు లేవు. భూకంపం జోన్‌ కాదు. సరిపోయినంత భూమితోపాటు నీరు కూడా అందుబాటులో ఉంది. ప్రాథమిక స్థాయిలో మౌలిక సదుపాయాలున్నాయి. విద్యా, వైద్య వసతులున్నాయి. భిన్న పంటలపైన పరిశోధన చేసే అవకాశం ఉంది.

నాగార్జున సాగర్‌ కెనాల్‌, కృష్ణా నది వల్ల ఈ ప్రాంతంలో మెరుగైన నీటి లభ్యత ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం సాధారణ స్థాయిలో ఉందని, ఇది సీఆర్డీయే పరిధిలోకి వస్తుందని వీసీ తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే, గుంటూరు రైల్వే స్టేషన్‌కి 10 కిలోమీటర్ల దూరంలో వర్సిటీ ఉంటుంది.

గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌కి నాలుగు కిలోమీటర్ల దూరంలో, గన్నవరం ఎయిర్‌పోర్టుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై-కోల్‌కతా హైవేకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఉన్న భూమి అంతా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి చెందినదే.

11 కేవీ టౌన్‌ ఫీడర్‌ ద్వారా నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందుతోంది. గుంటూరు సిటీకి ఈ యూనివర్సిటీ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని ఆ నివేదికలో వీసీ వెల్లడించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) నిబంధనల ప్రకారం అగ్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటే కనీసం 200 హెక్టార్లు (494.2 ఎకరాల) భూమి అందుబాటులో ఉండాలన్నారు.

బాపట్లలో 420 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్రంలో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకునేందుకు గుంటూరులోని లాం లో 500 ఎకరాలు గుర్తించినట్టు పేర్కొంటూ, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 జూన్‌ 25వ తేదీన కేంద్రానికి లేఖ రాశారు. అందుకు అనుమతిస్తూ ఆ ఏడాది సెప్టెంబరు 17వ తేదీన కేంద్రం రాష్ట్రానికి లేఖ పంపింది.

యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన నిధులు అందజేస్తామని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. ఈ మేరకు 4 అడ్వాన్స్‌డ్‌ పీజీ కోర్సులు, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, హోంసైన్స్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ సంస్థలతో గుంటూరులోని లాం లో అగ్రి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం 2016 జనవరి 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది.
 
‘‘లాం లో కాకుండా అగ్రియూనివర్సిటీ హెడ్‌క్వార్టర్‌ను మరో చోటకు తరలించడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన రూ.135 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ హెడ్‌క్వార్టర్‌ను మార్చాలంటే ఐకార్‌ అనుమతి తప్పనిసరి. ఎందుకంటే దీని నిర్మాణానికి అయ్యే నిధులను 100 శాతం కేంద్రమే భరిస్తుంది’’ అని అగ్రి యూనివర్సిటీ వీసీ స్పష్టం చేశారు.

తన నివేదికలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ‘‘తదుపరి నిధుల విడుదల కోసం ఐకార్‌, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ యూనివర్సిటీకి సపోర్టింగ్‌గా మరో 23 సంస్థలు లాంకు దగ్గర్లో ఉన్నాయి. దేశం వెలుపల ఉన్న ఏడు దేశాల్లోని 24 యూనివర్సిటీలతో అగ్రి యూనివర్సిటీకి అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
 
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ విద్య, పరిశోధనకు సంబంధించి ప్రముఖ వ్యక్తులు లాం లోని యూనివర్సిటీని సందర్శిస్తున్నారు. జాతీయ ఉన్నత వ్యవసాయ విద్యా ప్రాజెక్టులోని సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక లాం లోని అగ్రి యూనివర్సిటలో అమలవుతోంది.

ఇందులో భాగంగా వివిధ దేశాల్లో వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు, విద్యార్థులు అగ్రి యూనివర్సిటీని సందర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో కనెక్టివిటీ అనేది చాలా కీలకం’’ అని వివరించారు.

ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న ప్రస్తుత సమయంలో తరలించాలంటే ఐకార్‌ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజయ్‌ కల్లం వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం