ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం కావడంతో మరియు వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనుల్లో జాప్యం లేకుండా, రహదారులు, ఖాళీస్థలాల్లో వర్షపునీరు నిల్వ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.
రోజువారీ పర్యటనలో భాగంగా మంగళవారం కమిషనర్ బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, బెసెంట్ రోడ్డు, సిద్దార్థ కాలేజి రోడ్డు, మదర్ ధేరిసా జంక్షన్, పి.పి.క్లినిక్ రోడ్, మహానాడు రోడ్డు తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా పట్టణంలోని ఇళ్ల నడుమ ఉన్న ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరగకుండా, వర్షపునీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.
కాల్వలు లేని కాలనీల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డ్రెయిన్స్ ద్వారా వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రెయిన్లను విస్తరించాలని ఆదేశించారు. అలాగే జమ్మిచెట్టు సెంటర్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి సంబందించి అంచనలు సిద్దం చేయాలన్నారు.
పాలీక్లినిక్ రోడ్, పీబీ సిద్దార్థ కాలేజి వద్ద కంపౌడ్ వాల్ తొలగించిన ప్రాంతములో డ్రెయిన్ నిర్మాణం విషయమై ఎల్‌అండ్‌టి వారితో మాట్లాడి సత్వరం పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు.
మహానాడు రోడ్డు, ఏలూరు రోడ్డు నుంచి గాంధీనగర్ వరకు డ్రైనేజ్ సమస్యలు లేకుండా తగిన మరమ్మతులు చేపట్టేందుకు అంచనా సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. పర్యటనలో ఎఈ వి.చంద్రశేఖర్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖలకు సంబందించి క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.