Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇష్టం...

గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇష్టం...
, శుక్రవారం, 31 జులై 2020 (14:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరకు, ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్‌నే నియమిస్తూ గురువారం అర్థరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకుపోయినట్టుందని అన్నారు. రాజ్యాంగ పరంగా అన్ని వ్యవస్థలకు పరిమితులు ఉంటాయని... ఆ పరిమితులు లేవు అనే భ్రమలో ప్రవర్తిస్తే భంగపాటు తప్పదని చెప్పారు. నిమ్మగడ్డను మళ్లీ నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కరణ సమస్య తప్పిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఇదిలావుండగా, నిమ్మగడ్డ అంశంపై తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. 'ఎస్ఈసీ విషయంలో వైఎస్‌ జగన్ ప్రభుత్వం అనేకసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కి వారి తీర్పులు ధిక్కరించినా కడకు తలొంచక తప్పలేదు. నిమ్మగడ్డ రమేశ్‌గారి పునర్నియామకం విషయంలో ప్రభుత్వ తీరు తప్పని సామాన్య మానవుడు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం లెక్కచేయలేదు.
 
ఆయన సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుంది. కోర్టులతో మొట్టికాయలు తినడంతో పాటు వితండవాది అని దేశమంతా పేరుతెచ్చుకుంటున్నారు. చివరకు ఏమైంది? ఆ రమేష్ కుమార్‌ గారినే అదే స్థానంలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సహరాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తారని ఆశిస్తున్నాం' అని సోమిరెడ్డి చెప్పారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు అల్లు వర్ధంతి వేడుకలు : ఆ పేద రైతు వల్లే ఈ స్థాయిలో ఉన్నాం...