రైతే రాజు అని వేదికలెక్కి చాలా మంది నీతులు చెపుతారు. కానీ, సిసలైన రైతు దుస్థితి నేటికీ మారలేదు. సన్నకారు చిన్నకారు రైతుల దయనీయ స్థితికి అద్దం పట్టే చిత్రమిది. ఇది ఎక్కడో ఎడారి ప్రాంతంలోనిది కాదు... కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం హలిగెర గ్రామానికి చెందిన ఓ నిరుపేద రైతన్నదుస్థితి ఇది.
అసలే... వ్యవసాయం భారమై, పెట్రోలు, డీసిల్ ధరలు మండిపోతుంటే, ఇపుడు ట్రాక్టర్ తో దుక్కి దున్నాలన్నా గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తాయి. ఇక పెరిగిన వ్యవసాయ కూలీలు, ఖర్చలు భరించే ఆర్థిక స్థితి లేని ఈ రైతన్న పేరు మహానంది. ఈ నిరుపేద రైతన్న తన ఇద్దరు కుమారులను కాడెడ్డులుగా చేసుకుని వ్యవసాయపనులు చేసుకుంటున్నాడు. ఇందులో పెద్దవాడు రవితేజ, చిన్న కుమారుడు శివాజీ... ఇద్దరూ తమ తండ్రి మహానందికి ఇలా సేద్యంలో సాయం చేస్తున్నారు. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు.
ఈ దేశంలో రైతుకు పట్టిన దుర్గతిపై నేతలపై ఆగ్రహం కట్టలు తెంచుకు రాక మానదు. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఎరువుల ధరలు, విత్తనాల ధరలు, మందుల ధరలను అదుపు చేయకుంటే, ఇక వ్యవసాయం చేసేవారే కరువయ్యే దుస్థితిని ఈ చిత్రం మన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తోంది. రైతు అందించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలను అరికట్టాలి.
వ్యవసాయ మార్కెట్లలో దళారి వ్యవస్థను రూపుమాపాలి. ప్రత్యేకంగా రైతు పండించిన పంటలను వ్యవసాయ మార్కెట్ కు తరలించటం కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం రైతు నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులను 15 రోజుల వ్యవధిలో చల్లించి రైతన్నకు అండగా నిలవాలి. లేకుంటే, అన్నం పెట్టే రైతు నాకెందుకులే ఈ శ్రమంతా అనుకున్న మరునిమిషం... అంతా అన్నం దొరక్క అలమటించే రోజు సమీపిస్తుంది. ఇందుకు ఈ నిరుపేద రైతు కుటుంబం పడుతున్న కష్టమే సజీవ సాక్ష్యం.