Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో 813 పాజిటివ్‌ కేసులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌

Advertiesment
ఏపీలో 813 పాజిటివ్‌ కేసులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌
, బుధవారం, 22 ఏప్రియల్ 2020 (21:06 IST)
ఏపీలో తాజాగా 56 కేసులు పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 813 కు చేరింది. 

కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 203 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 177, కృష్ణా జిల్లాలో 86, నెల్లూరు జిల్లాలో 67, చిత్తూరు జిల్లాలో 59, వైయస్సార్‌ కడప జిల్లాలో 51, ప్రకాశం జిల్లాలో 48, పశ్చిమ గోదావరి జిల్లాలో 39, అనంతపురం జిల్లాలో 36, తూర్పు గోదావరి జిల్లాలో 26, విశాఖపట్నం జిల్లాలో 21 కేసులు గుర్తించారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 120 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గుంటూరు, వైయస్సార్‌ కడప జిల్లాలలో 23 చొప్పున,  విశాఖపట్నం జిల్లాలో 19 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో 7గురు, నెల్లూరు జిల్లాలో 6గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 4గురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒకరు.. మొత్తం 120 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 669 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 6గురు, కర్నూలు జిల్లాలో 5గురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చనిపోయారు.  
 
జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:
 
శ్రీకాకుళం జిల్లా:
కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచడం కోసం ఆయుష్‌ మందులు పంపిణీ చేయడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఆయుష్‌ విభాగం హోమియో మందు ఆర్సెనిక్‌ ఆల్బం 30 మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.

మందులను పక్కాగా పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణలో భాగంగా పరిస్ధితులకు అత్యంత సన్నిహితంగా పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి (ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు) ముందుగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు. 

ఆయుష్‌ హోమియో విభాగం జిల్లా నోడల్‌ అధికారి డా.పి.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆర్సినిక్‌ ఆల్బం 30 మందు రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నారు. జిల్లాలో లక్ష కుటుంబాలకు ఆ మందు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఒక కుటుంబానికి మూడు రోజులకు సరిపడే చిన్న సీసాలో హోమియో గులికలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఉదయం పరగడపున  పెద్దలు 6 గులికలు, చిన్నారులు 4 గులికలు మూడు రోజుల పాటు తీసుకోవాలని సూచించారు. మూడు రోజులు తీసుకోవడం ఒక డోసు క్రింద వస్తుందని చెప్పారు. రోగ నిరోధక శక్తిని పెంచుకొనుటకు ఈ మందును మరల నెల రోజుల తరువాత మూడు రోజుల పాటు తీసుకోవచ్చని వివరించారు.  
 
విజయనగరం జిల్లా:
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోనే కరోనా కట్టడి చేయవచ్చునని జిల్లా కలెక్టర్‌ డా. హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఇంతవరకు తమ జిల్లా గ్రీన్‌ జోన్‌ లో ఉందని, దానిని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరారు. జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి ఈఓపిఆర్‌డి, పంచాయత్‌ సెక్రటరీలతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

గ్రామాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు. అన్ని వార్డులతో పాటు, ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలని సూచించారు.  నీళ్ళ ట్యాంక్‌లు శుభ్రం చేయాలని, ట్యాంకుల వద్ద పిచ్చి మొక్కలను తొలగించాలని,  మురుగు కాలవలను, ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తొలగించాలని, మురికి కుంటలను శుద్ధి చేయాలనీ ఆదేశించారు. 

వచ్చే జూన్‌ నుంచి సీజనల్‌ వ్యాధులు సంక్రమించే సమయమని, అందువల్ల ముందుగానే జాగ్రతలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. ఎక్కడైతే పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటుందో అక్కడ వ్యాధులకు అవకాశం  తక్కువ ఉంటుందంటూ.. కేరళను ఉదహరించారు.

ఆ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించడం వల్లనే కరోనాను సమర్థంగా కట్టడి చేశారని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడం వల్ల ప్రజలు సురక్షితంగా ఉన్నారని, ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఏడడుగుల వ్యూహం:
జిల్లాలో కరోనా పాజిటివ్‌ రాకుండా చూడడంలో ఏడడుగుల వ్యూహాన్ని అమలు చేయడం జరిగిందని కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. వ్యాధి నిరోధానికి ముందుగా చర్యలు తీసుకున్నామని అందులో భాగంగానే ఇంటింటి సర్వే చేయించడం జరిగిందని , ప్రతి ఇంటికి వెళ్లి 6 రకాల సర్వేలు చేశామని చెప్పారు. సర్వేలో అనుమానం ఉన్న వారందరిని క్వారంటైన్‌కు పంపి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేశామని వెల్లడించారు. 

జిల్లాలో కరోనా కోసం 6 ఆసుపత్రులను మందులు, వైద్యులు, సిబ్బంది, బెడ్స్‌ , వెంటిలేటర్స్, ఐ.సి.యు, ఇతర ఎక్విప్మెంట్‌తో సిద్ధం చేయడం జరిగిందన్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కోసం, నిరాశ్రయుల కోసం 19 షెల్టర్లు ఏర్పాటు చేసి, వాటిలో 3 వేల మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. 

కంటైన్మెంట్‌ వ్యూహం కింద పోలీసుల సహకారంతో జిల్లాలో  ప్రధాన మార్గాలు, జాతీయ రహదారులు, లింక్‌ రోడ్లలో 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పక్క జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రం నుంచి రాకపోకలను పూర్తిగా నియంత్రించామని చెప్పారు. ఈ ఏడు వ్యుహాలతో జిల్లాను గ్రీన్‌ జోన్‌లో ఉంచగలిగామని కలెక్టర్‌ వివరించారు.
 
విశాఖపట్నం జిల్లా:
కోవిడ్‌–19 వల్ల జిల్లాలోని ఆయా మండలాల్లో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన 9435 మంది వలస కూలీలు/ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుతో వలస కూలీలు ఎటూ కదలలేక జిల్లాలోని ఆయా మండలాల్లో చిక్కుకుక్కుపోయారని, వారందరికీ ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో జిల్లా పౌర సరఫరాల అధికారులు, డిఎం పౌర సరఫరాలు, సూపర్‌ బజార్‌ ఎండి సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేసినట్లు చెప్పారు.  ప్రతి ఒక్కరికి 10 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 3 కేజీలు గోధుమ పిండి, 1 లీటరు నూనె పంపిణీ చేసినట్లు తెలిపారు.

500 గ్రాములు ఉప్పు, 250 గ్రాములు కారం, 250 గ్రాములు పసుపు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళాదుంపలను  కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 9435 మందికి పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు.  

వారిలో ఒడిషాకు చెందిన కార్మికులు 5837 మంది, బీహార్‌ రాష్ట్రానికి చెందిన కార్మికులు 1055 మంది, జార్ఖండ్‌కు చెందిన వారు 1032, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు 736, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు 328 మంది ఉన్నారని తెలిపారు.

వారితో పాటు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, అసోం, పంజాబ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ అండ్‌ కశ్మీర్, ఉత్తరాఖండ్, హరియాణకు చెందిన వలస కూలీలు, కార్మికులు కూడా ఉన్నారని కలెక్టర్‌ వివరించారు.   
 
కృష్ణా జిల్లా:
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రెడ్‌ జోన్‌ ప్రాంతాలతో సహా  పలు ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో రెడ్‌ జోన్‌ నగరాలు, పట్టణాలలో ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి.

ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆర్డర్స్‌ విధించారు. ఎవరైనా ∙మాస్కులు ధరించకుండా ఇళ్లలోంచి వెలుపలకు వస్తే శిక్షార్హులవుతారు. ఆ క్రమంలో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అందువల్ల ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకుని, నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు. 
 
చిత్తూరు జిల్లా:
లాక్‌ డౌన్‌ నేపధ్యంలో చంద్రగిరి నియోజకర్గ శాసనసభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలకు అండగా నిలిచారు. 25 లక్షల కిలోలు పండ్లను నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు ప్రతి ఇంటికి 14 కిలోలు  చొప్పున అందించేలా చర్యలు చేపట్టారు.

బుధవారం తిరుచానూరు మార్కెట్‌యారు లో 25 లక్షల కిలోలు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. తొలుత మార్కెట్‌ యార్డ్‌ చైర్మెన్‌ శ్రీవిద్యకు ఆయన పండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన వాటిని సమకూర్చడం తన వంతు బాధ్యతగా భావిస్తున్నానని, అందుకే ప్రతి ఇంటికి 14 కేజీల పండ్ల చొప్పున మొత్తం 1.60 లక్షల ఇళ్లకు మొత్తం 25 లక్షల కేజీల పండ్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. సామాజిక దూరం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పాటింపచేస్తూ పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 

తన నియోజకవర్గ ప్రజల కోసం సొంత నిధులతో 2,500 టన్నుల పండ్లు కొనుగోలు చేసినట్టు చెవిరెడ్డి చెప్పారు. ఆ విధంగా రైతులకు కూడా ప్రయోజనం కలిగించినట్లు పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు..
కాగా ఇప్పటికే ప్రతి ఇంటికి 2 శానిటైజర్స్, 3 మాస్కులు, 10 కేజీల కూరగాయలు, 10 కోడిగుడ్లు, నిత్యావసర వస్తువుల కిట్లు, 70 వేల కేజీల బ్లీచింగ్, టిటిడి సహకారంతో చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి రోజు 46 వేల మందికి ఉచిత భోజనం, ఇంటింటికి 15 సి విటమిన్‌ టాబ్లెట్స్, ఉద్యోగులందరికి గ్లౌసులు, మాస్కులు, ధర్మల్‌ స్కానర్స్, వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు) అవసరమైనంత పంపిణీ చేయడం జరిగిందని చెవిరెడ్డి వివరించారు. 
 
అంతే కాకుండా రెండు రోజుల క్రితం ఎ.రంగంపేటలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్న ప్రజలకు అవసరమైన రూ.7 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు అత్యవసరంగా వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
 
అనంతపురం జిల్లా:
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రారంభించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిత్యావసర సరుకులు, మందులు, వైద్య సంబంధిత పరికరాలు, అందుకు సంబంధించిన ముడిసరుకు తయారీ కేంద్రాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయా పరిశ్రమల పున:ప్రారంభానికి సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

జిల్లాలో రెడ్‌ జోన్‌లుగా ప్రకటించిన మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలు ప్రారంభించడానికి ఏ మాత్రం అనుమతి లేదని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. అనుమతించిన పరిశ్రమలలో కోవిడ్‌ –19 వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా భౌతిక దూరాన్ని పాటించడం, పరిసరాల  పరిశుభ్రత పాటిస్తూ, పరిశ్రమల్లో పనిచేసే వారికి థర్మల్‌ స్క్రీన్‌ టెస్ట్‌ చేయాలన్నారు.

అలాగే అక్కడ పని చేసే సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు, పరిశ్రమ అంతటా క్రిమి సంహారక మందులతో స్ప్రేయింగ్‌ చేయించడం, అక్కడి సిబ్బందికి ఆహారాన్ని అందించాలన్నారు. 
అనుమతించిన పరిశ్రమలున్న ప్రాంతాల నుంచి మాత్రమే కార్మికులను అనుమతించాలని, ఇతర ప్రాంతాల నుంచి, రెడ్‌ జోన్‌లో ఉన్న కార్మికులు, కంటైన్మెంట్‌ జోన్‌ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఆయా పరిశ్రమల్లో పని చేయడానికి వీలు లేదన్నారు.

కేవలం గ్రీన్‌ మరియు ఆరంజ్‌ జోన్ల మధ్య నుండి వచ్చే కార్మికులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కార్మికులకు నివసించడానికి వసతి సౌకర్యం కల్పించాలని, వారు రావడానికి, వెళ్లడానికి సంబంధిత కంపెనీలే వాహన సౌకర్యం కల్పించాలన్నారు. 

ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఉందని, అలాగే  నగరపాలక, మునిసిపాలిటీ పరిధులకు అవతల ఉన్న పరిశ్రమలు అనుమతి పొంది ప్రారంభించు కోవాలని కలెక్టర్‌ సూచించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 10 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
 
వైయస్సార్‌ కడప జిల్లా:
కరోనా నివారణకు మందు లేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి. అంజాద్‌ భాష పేర్కొన్నారు. బుధవారం కోటిరెడ్డి సర్కిల్‌ నందు నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో 3.5 లక్షలతో కొనుగోలు చేసిన సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రేయింగ్‌ మిషన్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్ప్రేయింగ్‌ మిషన్లు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 14 మేజర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఇవ్వడం జరిగిందన్నారు.

ప్రస్తుతం ఈ మిషన్‌ ద్వారా కడపలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లలో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. 50 డివిజన్లలో ఇప్పటికే రెండు విడతలుగా సోడియం హైపో క్లోరైడ్‌  ద్రావణాన్ని స్ప్రే చేయడం జరిగిందన్నారు.

సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేయడంవల్ల కరోనా వైరస్‌ చనిపోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలలో తప్పక స్ప్రేచేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రెడ్‌ జోన్‌ ఏరియాలలో రోజు మార్చి రోజు క్రమం తప్పకుండా స్ప్రేయింగ్‌ చేయిస్తామని డిప్యూటీ సీఎం వివరించారు.
 
కర్నూలు జిల్లా:
జిల్లాలో వివిధ క్వారంటైన్‌ కేంద్రాలలో 14 రోజుల పీరియడ్‌ పూర్తి చేసుకుని, కోవిడ్‌–19 ప్రకారం రెండు రిపీట్‌ టెస్టుల్లో కరోనా నెగటివ్‌ ఫలితం వచ్చిన 96 మందిని కోవిడ్‌ డిశ్చార్చ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం బుధవారం సాయంత్రం డిశ్చార్జ్‌ చేశారు.

కర్నూలు ఆర్‌యూ, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గోస్పాడు క్వారంటైన్‌ కేంద్రాల నుంచి 96 మందిని కోవిడ్‌–19 ప్రోటోకాల్‌ ప్రకారం డిశ్చార్చ్‌ చేసి.. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.2 వేల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక వాహనాల్లో వారిని ఇళ్లకు పంపించామని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పై పోరాటంలో కోలుకున్న 8 మంది