విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు.
టాస్క్‌ఫోర్స్ ఏడిసిపి డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపిలు టి.కనకరాజు, వి.ఎస్.ఎన్.వర్మ, ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్, ఎస్.ఐ.లు రవితేజ, శేషారెడ్డి మరియు వారి సిబ్బందితో విజయవాడ, మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరప్పాడు రింగు, ఏలూరు రోడ్డులో ఉన్న కె-హోటల్ సమీపంలో వాహనాలను తనిఖీలు చేశారు.
ఏపి 27బిఇ1162 స్కార్పియో, ఎపి 10 ఎడి7449 మారుతీ ఎస్ట్రీమ్ కార్లలో ఐదుగురు వ్యక్తులు గంజాయిని ఆక్రమంగా రోడ్డు మార్గం ద్వారా తూర్పుగోదావరి జిల్లా, అన్నవరం నుండి తెలంగాణ రాష్ట్రం, గద్వాలకు అక్కడ నుండి మహారాష్ట్రకు రోడ్డు మార్గం గుండా ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ. 24.70 లక్షలు విలువైన 494 కేజీల గంజాయి 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా గంజాయి అక్రమంగా తరలిస్తున్న కంచి శ్రీనివాసులు, ఐజా గ్రామం, గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మొరటాల కృష్ణా రెడ్డి, వినుకొండ, గుంటూరు జిల్లా, మునగాల శివ, ఉల్లి పెట్టి, ఎమ్.ఆర్.పల్లి, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆకుతోట వీరన్న, మిలటరీ కాలనీ, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా, యాదగిరి రోసయ్య, మద్దూరు, కర్నూలు జిల్లాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గుర్తించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అభినందించారు.