Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 473 మందికి కరోనా..10,505 మందికి వైద్య పరీక్షలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 473 మందికి కరోనా..10,505 మందికి వైద్య పరీక్షలు
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:04 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో 10,032 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణ కాగా.. 473 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

రాష్ట్రంలో 338 క్వారెంటైన్ కేంద్రాలలో 59, 686 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5864 మంది క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్లు తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్త రిపోర్ట్ :
రాష్ట్రంలో 473 పాజిటివ్‌ కేసులు:
రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో కొత్తగా 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మళ్లీ అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో ఒక కేసు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 473 కి చేరింది. 

తాజా పెరుగుదలతో రాష్ట్రంలో ఇప్పుడు కరోనా పాజిటివ్‌ కేసుల్లో గుంటూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. . గుంటూరు జిల్లాలో  109 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 91, నెల్లూరు జిల్లాలో 56, కృష్ణా జిల్లాలో 44, ప్రకాశం జిల్లాలో 42,  వైయస్సార్‌ కడప జిల్లాలో 31, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలలో 23 చొప్పున, విశాఖపట్నంలో 20, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలలో 17 కేసుల చొప్పున నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.

కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 6గురు, కృష్ణా జిల్లాలో 4గురు, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 15 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

కాగా, ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, గుంటూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఒకరు చొప్పున చనిపోయారు.  
 
జిల్లాల వారీగా వివరాలు:
 
శ్రీకాకుళం జిల్లా:
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. మరోవైపు ఇదే పంథా కొనసాగేలా అవ్వా తాతలను సురక్షితంగా ఉంచడం, చేతులు తరుచూ శుభ్రం చేసుకోవడంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ఈ ప్రక్రియలో వచ్చే వారం రోజులు చాలా కీలకమన్న కలెక్టర్, ప్రజల సహకారంతోనే జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా సాగుతుందని చెప్పారు.
 
కరోనా పరీక్షల నిర్వహణకు ఇప్పటికే చర్యలు చేపట్టామని.. రోజుకు 380 నమూనాలకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని.. ఇంకా ఎక్కువ నమూనాలు సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆహారంతో పాటు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న సంస్థలు, వ్యక్తులు వాటిని తక్షణమే నిలిపి వేయాలని కలెక్టర్‌ కోరారు. జిల్లా యంత్రాంగం అక్షయ పాత్ర, అరబిందో సహకారంతో రోజుకు 5 వేల మందికి ఆహారం అందిస్తుందని చెప్పారు. అందువల్ల ఎవరైనా ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనుకుంటే, స్థానిక తహసీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు. అలా కాకుండా ఏకపక్షంగా వాటిని పంపిణీ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. 
 
విజయనగరం జిల్లా:
లాక్‌డౌన్‌ సమయంలో  ఆహార పదార్ధాలు, నిత్యావసరాలు, ఇతర సరుకుల పంపిణీకి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ వెల్లడించారు. అవసరమైన సరుకులు, పదార్ధాల పంపిణీకి మాత్రమే అనుమతినివ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. 

ఆహార పదార్ధాలు వృథా కాకుండా చూడటం, ప్రణాళికా వాటిని పంపిణీ చేయడం, అవసరమైనవి మాత్రమే ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవడం, వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించేలా చేయడం తదితర పనుల నిర్వహణకు జిల్లా స్థాయిలో డిస్ట్రిబ్యూషన్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ప్రజలకు సరుకులు పంపిణీ చేయదలచిన వారు కనీసం రెండు రోజుల ముందే అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో కూడా అనుమతి ఇస్తామని తెలిపారు.

పంపిణీని నియంత్రించేందుకు, అవసరమైన వారికే అవి అందేలా చూసేందుకు విజయనగరం పట్టణంలో 20 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కేంద్రాల్లో పంపిణీ బాధ్యతలను అక్కడి వలంటీర్, మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ నిర్వహిస్తారని, సరుకులు కావాల్సిన వారు వారిని సంప్రదించాలని çకలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. 
 
విశాఖపట్నం జిల్లా:
జిల్లాలో కోవిడ్‌–19 కేసులు పెరగకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కోవిడ్‌ నివారణకు అవసరమ్తెన మాస్కులు, శానిట్తెజర్లు, పీపీఈ కిట్లకు జిల్లాలో కొరత లేదని ఆయన వెల్లడించారు. 

విశాఖ జిల్లాలో కరోనా కేసుల వివరాలు:
– ఇప్పటి వరకు గుర్తించిన కరోనా పాజిటివ్‌ కేసులు: 20
– మొత్తం ఐసోలేషన్‌లో ఉన్న వారు: 72
– ఛాతీ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న వారు: 31
– పద్మజ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న వారు: 41 
– గీతం హాస్పిటల్‌లో కరోనా అనుమానితులు: 10
– కరోనా నెగిటివ్‌ వచ్చిన వారి సంఖ్య: 51
– రిపోర్టులు రాని వారి సంఖ్య: 70
– జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు: 96
– అందుబాటులో ఉన్న ఐసోలేషన్‌ సింగిల్‌ రూమ్స్‌: 500
– ఐసోలేషన్‌కు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ పడకలు: 4623
– అందుబాటులో ఉన్న క్వారంటైన్‌ పడకలు: 4582
– జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులు: 2795 
 
తూర్పు గోదావరి జిల్లా:
జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత శాంపిల్స్‌ 1638 పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపగా, 1292 కేసులు నెగటివ్‌గా తేలాయి. 17 కేసులు పాజిటివ్‌గా రాగా, ఇంకా 329 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్‌ టు హౌస్‌ సర్వే టీములు సందర్శించి మొత్తం 17,751 మందిని కోవిడ్‌–19 సర్వైలెన్స్‌లో పర్యవేక్షిస్తున్నారు.
 
14,960 మంది 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకోగా, 2250 మంది 15 నుండి 28 రోజుల పర్యవేక్షణ కాలంలో ఉన్నారు. మరో 199 మంది 14 రోజులలోపు పర్యవేక్షణలో ఉన్నారు. జిల్లాలో 61 క్వారంటైన్‌ సెంటర్లతో పాటు, రోగుల చికిత్స కోసం 9603 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేశారు.

3442 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లోను, 15 మందిని క్వారంటైన్‌ కేంద్రాలలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 20 వసతి కేంద్రాల ద్వారా 839 మందికి ప్రతి రోజు ఆహారం అందిస్తున్నారు. మరోవైపు వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా నిత్యం దాదాపు 5 వేల మందికి ఆహారం సమకూరుస్తున్నాయి.
 
పశ్చిమ గోదావరి జిల్లా:
జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య: 27
జిల్లాలో ఇప్పటి దాకా సేకరించిన రక్త నమూనాలు: 973
వాటిలో 705 రిపోర్టులు రాగా, నెగిటివ్‌ రిపోర్టుల సంఖ్య: 678
ఇంకా రిపోర్టులు రావాల్సిన సంఖ్య: 268
జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారు: 4,821 మంది
వారిలో 28 రోజుల గృహ నిర్బంధం పూర్తి చేసుకున్న వారు: 4,286 మంది.
ఇంకా గృహ నిర్బంధంలో ఉన్న వారు: 535 మంది
మరోవైపు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు గ్రామాల్లో శానిటేషన్, సర్వే నిర్వహిస్తున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల లభ్యత, తాగునీటి సరఫరాపై వివరాలు ఆరా తీశారు.

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వైరస్‌ను అరికట్టడంలో అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, వలంటీర్లను మంత్రి ప్రశంసించారు. సిబ్బందిలో ఉత్సాహం కలిగించడానికే ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 
 
కృష్ణా జిల్లా:
జిల్లాలో తాజాగా 6 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కు చేరింది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు 1687 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 892 మంది రిపోర్టులు నెగటివ్‌ గా వచ్చాయి.

ఇంకా 751 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయగా, వాటిలో ప్రస్తుతం 420 మంది ఉన్నారు. ఇంకా హోం ఐసోలేషన్‌ లో 599 మంది ఉండగా, కరోనా వైరస్‌ అనుమానంతో ఇప్పటి వరకు 60 మంది ఆసుపత్రిలో చేరారు.

జిల్లాలో వలస కార్మికుల కోసం 56 శిబిరాలు ఏర్పాటు చేయగా, వాటిలో 4460 మంది వసతి పొందుతున్నారు. మూడో విడత కుటుంబ సర్వేలో భాగంగా కంటైన్మెంట్‌ ప్రాంతాలైన విజయవాడలోని సీతారామనగర్, ఖుద్దుస్‌ నగర్‌తో పాటు, మచిలీపట్నం, నూజివీడు లో శాంపిల్స్‌ సేకరించారు.

విజయవాడలోని రాణీగారితోటలో కొత్త కేసులు నమోదు కావడంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఏరియా మొత్తం శానిటేషన్‌ చేస్తున్నారు. వలంటీర్ల సాయంతో ఇప్పటికే సర్వేను పూర్తి చేశారు. ముందస్తు జాగ్రత్తగా కొంతమందిని క్వారంటైన్‌లో ఉంచారు.

గుడివాడ నియోజకవర్గంలో కొత్త కేసులు నమోదు కాలేదు. ఇక మూడో విడత సర్వేలో భాగంగా దాదాపు 700 మంది గ్రామ, వార్డు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సర్వే నిర్వహించారు 
 
గుంటూరు జిల్లా:
జిల్లాలో మరోసారి అత్య«ధిక కేసులు నమోదయ్యాయి. తాజాగా 16 కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంతో, జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య వంద దాటి 109కి చేరింది. కాగా, ఇంకా 400 శాంపిల్స్‌ రిజల్ట్‌ రావాల్సి ఉండటంతో కేసులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గుంటూరులో 12 ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా గుర్తించి 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నారు. నగరంలో మాస్క్‌ లేకుండా బయటకు వస్తే, రూ.1000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.500 ఫైన్‌ వేస్తున్నారు. ఇంకా పీడీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రజలు సరుకుల హోం డెలివరీని సద్వినియోగం చేసుకోవాలని, రోజూ బయటకు రాకుండా వారానికి సరిపడా సరుకులు ఒకేసారి కొనుక్కోవాలని అధికారులు కోరారు. ఎవరికైనా కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపిస్తే, వెంటనే 104 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి కాల్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. 

గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు కావడంతో నిబంధనలు కఠినతరం చేశారు. నగరంలోని ఆనందపేట, కుమ్మరి బజార్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో పాజిటివ్‌ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ అయిన 950 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులలో అత్యధికంగా ఒక గుంటూరులోనే 83 ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇంకా మాచర్ల–5, అచ్చంపేట–4, క్రోసూరు–1, కారంపుడి–1, మంగళగిరి–3, నర్సరావుపేట–3, పొన్నూరు–2, దాచేపల్లి–1, మేడికొండూరు–1, చేబ్రోలు–1 కేసు నమోదు కాగా, యూపీకి చెందిన ఒకరికి కరోనా సోకినట్లు గుర్తించారు. 
 
ప్రకాశం జిల్లా:
జిల్లాలో మొత్తం 41 పాజిటివ్‌  కేసులు నమోదు కాగా 638 కేసులు నెగటివ్‌గా తేలాయి. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించిన అధికారులు ఆ మేరకు తగిన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో హోమ్‌ ఐసోలేషన్‌లో 300 మంది ఉన్నారు.

పట్టణాల కన్నా గ్రామాల్లో కరోనాపై చైతన్యం కనిపిస్తోంది. గ్రామాల్లో ఎక్కువగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్‌ సెంటర్, ప్రతి మండంలో ఒక రిలీఫ్‌ సెంటర్‌ ఏర్పాటు దిశలో చర్యలు. మరోవైపు క్వారంటైన్‌ సెంటర్లు బలోపేతం చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు.
 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
జిల్లాలో ఇప్పటి వరకు 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తొలి మరణం సంభవించింది.
స్వీయ గృహ నిర్భంధంలో 401 మంది ఉండగా, ఐసోలేషన్‌లో 46 మంది ఉన్నారు.
కరోనా వైరస్‌ అనుమానిత శాంపిల్స్‌ 721 పరీక్షకు పంపగా, వాటిలో ఇంకా 32 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
క్వారంటైన్‌ సెంటర్లలో 396 మంది ఉన్నారు.
జిల్లాకు విదేశాల నుంచి 1700 మంది రాగా, దాదాపు వారందరినీ ట్రాక్‌ చేశారు.
 
చిత్తూరు జిల్లా:
జిల్లాలో రెడ్‌జోన్‌ ప్రాంతాలుగా ప్రకటించిన తిరుపతి, శ్రీకాళహస్తి, వడమాలపేట, పలమనేరు, రేణిగుంటతో పాటు ఆరెంజ్‌ జోన్లలో కూడా అవసరమైన నిత్యావసరాల సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 23 నమోదు కాగా, లండన్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనా అనుమానిత లక్షణాలతో తిరుపతిలో 17 మంది, చిత్తూరులో 5గురు చికిత్స పొందుతున్నారు.
కాగా, ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న వారందరి శాంపిల్స్‌ సేకరించి పరీక్షకు పంపారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది.

అనంతపురం జిల్లా:
కరానా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర వ్యక్తులకు అన్ని రకాల మంచి వైద్య సేవలు అందిస్తామని, వారికి సకల సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు భరోసానిచ్చారు. నగరంలోని కోవిడ్‌–19 ఆస్పత్రి అయిన సవేరా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కలెక్టర్, ఈ వైరస్‌ సోకిన వారు ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు.
 
కరోనా పాజిటివ్‌ కేసులు కొత్తగా మరో రెండు నమోదు కావడంతో జిల్లాలో ఆ కేసుల సంఖ్య 17కు చేరింది. హిందూపురంకు చెందిన తహసీల్దార్‌తో పాటు, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఒక డాక్టర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కలెక్టర్‌ వెల్లడించారు. 

మరోవైపు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు మరింత ముమ్మరం చేయాలని బీసీ సంక్షేమ మంత్రి ఎం.శంకరనారాయణ కోరారు. 
 
వైఎస్‌ఆర్‌ కడప జిల్లా:
జిల్లాలో ఇప్పటివరకు 428 త్రొట్‌ స్పిల్స్‌ టెస్టులు చేయగా, 31 పాజిటీవ్‌ కేసులు రాగా, 397  నెగెటీవ్‌ రిపోర్టులు వచ్చాయి. నగరంలో నిత్యావసరాల సరఫరా కోసం నగర పాలక సంస్థ 50 డివిజన్లలో తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయడంతో ప్రధాన మార్కెట్లలో రద్దీ తగ్గింది.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కొనుగోళ్లు సాగించారు. షాపింగ్‌ కాంప్లెక్సులు, షాపింగ్‌ మాళ్లు, కమర్షియల్‌ షాపులన్నీ మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల అంగళ్ళు తప్ప ఉదయం 9 గంటల తర్వాత మూతపడ్డాయి. మద్యం, మాంసం దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి.

కోవిడ్‌–19 నియంత్రణకు స్వీయ గృహ నిర్బందం పాటించడం ఒక్కటే మార్గం అని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో మాజీ మేయర్‌ సురేష్‌ బాబుతో కలిసి.. దాతల సహకారంతో నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 5వ డివిజన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌లో మాజీ కార్పొరేటర్‌ బండి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కూరగాయలు, సరుకులను పంపిణీ చేశారు.  
 
కర్నూలు జిల్లా:
జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 92 నమోదయ్యాయి. జిల్లాలో తాజాగా నమోదైన 8 కేసులు కర్నూలు నగరంలోనివే కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. నగరంలోని గనీగల్లీలో 5, బుధవారిపేటలో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో హైరిస్క్‌ అలర్ట్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేసి, రాకపోకలను పూర్తిగా బంద్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ పోలీసులను ఆదేశించారు. అలాగే టోటల్‌ శానిటేషన్‌తో పాటు, ఇంటింటా మెడికల్‌ స్క్రీనింగ్‌ మరింత ముమ్మరం చేయాలని మున్సిపల్, హెల్త్‌ అధికారులకు నిర్దేశించారు.

కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం ఆయా ప్రాంతాల్లోని పరిధిలో, ఇంటింటికి హైపో క్లోరైడ్‌ సోల్యూషన్‌ తో స్ప్రే చేయించడం, బయోమెడికల్‌ వేస్టేజ్‌ని ప్రాపర్‌గా డిస్పోజ్‌ చేయించడం తదితర పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడా లోపం ఉండకూడదన్న కలెక్టర్‌. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్‌ జోన్, హై రిస్క్‌ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కరోనా టెస్టుల కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరిన కలెక్టర్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 3 వరకు ఇ-పాస్ గడుపు పెంపు: హిమాన్హు శుక్లా