టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా ఈ నెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు రానున్నారు.
ఈ నేపథ్యంలో అన్నదానం ట్రస్టుకి 30 లక్షల రూపాయలు విరాళంగా అందించనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా అన్నదానానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు విరాళమిస్తున్నారు.
14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు
ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్‌లో టిక్కేట్లను బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే ప్రస్తుతం ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించనుంది.
ఏడాది కాలానికి సంబంధించి 28258 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6468 తోమాల సేవా టిక్కెట్లు, 6808 అర్చన సేవా టిక్కెట్లు, 2124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కెట్లు, 2136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు పొందారు.
వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేష పూజలు.... ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహించాలని పాలకమండలి తీర్మానించింది. ప్రతి నిత్యం ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తూనందున.. విగ్రహాలకు అరుగుదల సంభవిస్తుందని అర్చకులు తెలిపారు.
ఈ క్రమంలో ఆగమపండితులు, ఆలయ జియ్యంగార్లు సలహా మేరకు ఇకపై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేషసేవ పూజలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.