Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇళ్ళస్థలాలు

Advertiesment
25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇళ్ళస్థలాలు
, శనివారం, 28 డిశెంబరు 2019 (08:02 IST)
వచ్చే ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు.

వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.  కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 3,70,255 గృహాలు మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు  వెల్లడించారు. 

అందులో భాగంగా 1,28,941 గృహాలు పట్టణ ప్రాంతానికి సంబంధించినవి కాగా, 2,41,314 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.  ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ.10,545.78 కోట్లని ఇందులో కేంద్రం వాటా రూ.5,553.82 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ. 2,495.98  కోట్లు, లబ్ధిదారుని వాటా/బ్యాంక్ లోను 2,495.98 కోట్లు అని మంత్రి వివరించారు.

3,70,255 లబ్దిదారుల్లో ఎస్సీలు 72,797 ఎస్టీలు 12,265, బీసీలు 2,02,326, మైనార్టీలు 34,626 మరియు ఇతరులు 82,867 ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు మంజూరైన 3,83,272 ఇళ్లు కలుపుకొని ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి పట్టణ పేదలకు మొత్తం 7,53,527 గృహాలు మంజూరు అయ్యాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే  4 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాలు కలిపి మొత్తం 25 లక్షల ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.  ఇప్పటివరకు 21 లక్షల మందికి ఇంటి నివేశన స్థలాలు అవసరమని, 7 లక్షల మందికి ఇళ్లు అవసరమని దరఖాస్తులు వచ్చాయన్నారు. 

28 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖ మంత్రితో కలిసి 9 జిల్లాల్లో  పర్యటించి భూసేకరణ కోసం సమీక్షలు కూడా చేశామన్నారు. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించిన అనంతరం త్వరలోనే మిగిలిన 3 జిల్లాల్లో కూడా పర్యటించి భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితాలను రూపొందించడం జరిగిందని అన్నారు.

నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రానున్న నాలుగేళ్లలో నాలుగు విడతల్లో 25 లక్షల పక్కాగృహాలను కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పేదలకు ఇచ్చే భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 
 
గ్రామాల్లో సగటున ఒక్కో లబ్ధిదారుకు సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి కేటాయించి  పక్కా ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించనున్నామన్నారు. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో కూడా భూమిని సేకరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామం, పట్టణ వార్డులవారీగా దరఖాస్తులు స్వీకరించామని మంత్రి అన్నారు.

ఇళ్లస్థలాల కోసం అనువైన అన్ని రకాల ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం జరగదని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బలవంతపు భూసేకరణకు ఈ ప్రభుత్వం వ్యతిరేకమనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు.

ఈ భూసేకరణ, భూ అభివృద్ది కోసం సుమారు 45 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేశామన్నారు. అదే విధంగా ప్రభుత్వం స్థలంతో పాటుగా 22వేల ఎకరాల అవసరమవుతాయని  ప్రభుత్వం అంచనా వేసిందన్నారు.

ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే తద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల సంపద సృష్టించవచ్చని మంత్రి అన్నారు. రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదనే లక్యంనేతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు: ‘ముఖ్య‌మంత్రి ప్రాణానికే ముప్పు ఉందని భావించే పరిస్థితి వచ్చింది.. ఒక్క పైసా లేకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చు’