Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. విజయనగరంలో పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ 25 మంది దుర్మరణం : 100 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాద ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి

ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. విజయనగరంలో పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ 25 మంది దుర్మరణం : 100 మందికి గాయాలు
హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (04:31 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా  మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాద ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్‌ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టాయి.

ఈ ప్రమాదంలో 25 మందికిపైగా  మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయానికి 25 మృతదేహాలను వెలికితీశారు. పలు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సుమారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అర్ధరాత్రి 11.10 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇంజన్‌ సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఇంజనుతోపాటు లగేజ్ వ్యాన్, రెండు జనరల్ బోగీలు, రెండు స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీ టయర్ కోచ్, ఏసీ టూ టయర్ కోచ్ పట్టాలు తప్పాయని ప్రాథమిక సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు.
 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నాలుగు ప్రమాద ఉపశమన వ్యాన్‌లను ఘటనా స్థలానికి పంపించామని, గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులలో చేర్చడమే ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకున్నామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. వ్యక్తిగతంగా తాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, ప్రమాద స్థలానికి తక్షణం వెళ్లి సహయ కార్యక్రమాలకోసం ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించానని రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి వాల్తేరు డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రలేఖ ముఖర్జీ రిలీఫ్‌ వ్యాన్‌తో సంఘటనా స్థలానికి బయలుదేరారు.
 
సుదీర్ఘమైన ప్రయాణం.. చిమ్మ చీకటి.. దాదాపు 100 కిలోమీటర్ల వేగం.. అంతా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి.. అటవీ ప్రాంతం.. ఒక్క సారిగా పెద్ద శబ్ధం.. ఏం జరిగిందో అర్థం కాలేదు. నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎలాగైనా బయట పడాలని ఆరాటంలో బోగీల్లో ఒకరిపై ఒకరు పడిపోయారు.. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకోవడంతో కొందరు, బోగీలు పడిపోయిన తాకిడికి గాయాలై మరికొందరు విగతజీవులయ్యారు.

పదుల సంఖ్యలో గాయపడిన వారి హాహాకారాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. తాము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైందని తెలుసుకుని బోగీల్లో చిక్కుకుపోయిన వారు వణికిపోయారు.  ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్‌ (8106053006 (ఎయిర్‌టెల్‌), 8500358712 (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఏర్పాటు చేశారు.
 
ఎస్‌.6, ఎస్‌.7 స్లీపర్‌ బోగీలతో పాటు ఒక ఏసీ బోగీ, నాలుగు జనరల్‌ సహా 8 బోగీలు బోల్తాపడ్డాయి. సమాచారం అందిన వెంటనే విజయనగరం, విశాఖపట్నం నుంచి సహాయ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. బోగీలను గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉం దని రైల్వేవర్గాలు పేర్కొన్నాయి.

వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రలేఖ ముఖర్జీ విశాఖ నుంచి రిలీఫ్, మెడికల్‌ రిలీఫ్‌ ట్రైన్‌లతో హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రమాద స్థలిలో నాలుగు అంబులెన్సులు వైద్య సేవల్లో నిమగ్నమయ్యాయి. స్థానికులు సైతం ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సుమారు 70 మంది క్షతగాత్రులను పార్వతీపురం, రాయ్‌గఢ్‌ ఆస్పత్రులకు తరలించారు.
 
మొన్న కాన్పూర్, ఇవ్వాళ హీరాఖండ్.. ప్రమాదాలకు అంతేలేదా..
గతేడాది నవంబరులో కాన్పూర్‌ సమీపంలో ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన మరవక ముందే హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కూడా కాన్పూర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉండగా రైలు పట్టాలు తప్పడంతో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. కాన్పూర్‌ రైలు ప్రమాదంలో 14 బోగీలు చెల్లా చెదురవడంతో 143 మంది చనిపోయారు. హిరాఖండ్‌ ఎక్స్‌ప్రె్‌సలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రెండు ప్రమాదాలూ రైలు పట్టాలు తప్పడం వల్లే జరిగాయి. కాన్పూర్‌ సమీపంలో రైలు ప్రమాదం లాగానే.. హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ప్రమాదానికి గురికావడం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐక్యత కాదు ట్రంప్... ముందు నీ యవ్వారం తేల్చు: తిరగబడ్డ అమెరికన్ భద్రకాళులు