Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐక్యత కాదు ట్రంప్... ముందు నీ యవ్వారం తేల్చు: తిరగబడ్డ అమెరికన్ భద్రకాళులు

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలైనా కాక ముందే లక్షలాదిమంది అమెరికన్ మహిళలు వాషింగ్టన్ వీధుల్లో భద్రకాళులై తిరగబడ్డారు. ట్రంప్ పురుషాధిక్య భావాలకు వ్యతిరేకంగా ల

Advertiesment
ఐక్యత కాదు ట్రంప్... ముందు నీ యవ్వారం తేల్చు: తిరగబడ్డ అమెరికన్ భద్రకాళులు
హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (02:49 IST)
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలైనా కాక ముందే లక్షలాదిమంది అమెరికన్ మహిళలు వాషింగ్టన్ వీధుల్లో భద్రకాళులై తిరగబడ్డారు. ట్రంప్ పురుషాధిక్య భావాలకు వ్యతిరేకంగా లేచినిలబడ్డ అమెరికన్ మహిళలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో వేలాది మంది మహిళలు శనివారం మార్చ్ చేస్తూ సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ బీభత్సం సృష్టించిన గుంపులతో పోలిస్తే శనివారం ట్రంప్ వ్యతిరేక మహిళా నిరసనకారులు భారీ ఎత్తున గుమికూడినప్పటికీ శాంతియుత ప్రదర్శనలకే పరిమితం అయ్యారు.
 
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ వైట్ హౌస్‌లో నేషనల్ ప్రేయర్ సర్వీసుకు హాజరువుతుండగా వాషింగ్టన్ నగరం మహిళా జన సంద్రాన్ని తలపించింది. అంచనాలకు మించి అయిదు లక్షల మందికి పైగా మహిళలు నేషనల్ మాల్ చేరుకున్నారు.  ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా డొనాల్డ్ ట్రంప్‌పై దుమ్మెత్తిపోయడం గమనార్హం. "ఈ దేశ నైతిక మూల సూత్రాల కోసం మేం ఈరోజు ఇక్కడ మార్చ్ చేస్తున్నాం. మహిళలపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాం. మా గౌరవ మర్యాదలు, మా హక్కులు, మా శీలం సమస్తంపై దాడులు జరుగతున్నాయి. విద్వేష, విభజన రాజకీయాల ప్లాట్‌ఫాం నిన్న అధికారాన్ని స్వీకరించిందం"టూ హాలీవుడ్ నటి అమెరికా ఫెరీరా శనివారం ఉదయం నేషనల్ మాల్‌లో గుమికూడిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించింది. అయితే "అధికారాన్ని స్వీకరించిన ప్రెసిడెంట్ అమెరికా కాదని, మనమే అమెరికా అని, ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటడానికే ఇక్కడ నిలబడ్డామం"టూ ఆమె ట్రంప్‌పై ధ్వజమెత్తారు. ఇక మడోనా, మైఖేల్ మూర్ వంటి ఇతర సెలబ్రిటీలు పాల్గొన్న ఈ ఆందోళనలు పురుషులను, మహిళలను, చిన్న పిల్లలను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించాయి. ఒక మహిళ అయితే ట్రంప్‌ను పరమ భీకర అధ్యక్షుడిగా వర్ణించింది.
 
ఇక చికాగో నగరంలో ట్రంప్ వ్యతిరేక మార్చ్‌ నిర్వహించడానికి ప్రయత్నించిన ఆర్గనైజర్లు ఆ మార్చ్‌కు లక్షా యాభై వేలమందిపైగా హాజరు కావడంతో భద్రతా కారణాలపై మార్చ్‌ని రద్దుచేశారు. 
 
అయితే అధ్యక్షుడిగా చేసిన తొలి ప్రసంగంలో ట్రంప్ దేశంలోని విభజనలను తొలగించడానికి సరికొత్త జాతీయాభిమానం పెంపొందాలని పిలుపిచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగానే శనివారం నిరసనకారులు ఐక్యత పాటించారు  కానీ కొత్త అధ్యక్షునికి సామూహిక వ్యతిరేకత తెలిపిన ఐక్యత అది. 24 గంటల ముందు లక్షలాది ట్రంప్ మద్దతుదారులు హర్షధ్వానాలు చేసిన మైదానంలోనే వేలాది మహిళలు తిరుగుబాటుకు సంకేతంగా వైవిధ్యపూరితమైన దుస్తులు ధరించి కదం తొక్కారు. 
 
వాషింగ్టన్‌లో మహిళాలోకం పుస్సీ హ్యాట్‌లను ధరించి అధ్యక్షుడికి వ్యతిరేకంగా అసభ్యకరమైన సందేశాలు, నినాదాలు చేస్తూ నేషనల్ మాల్‌ని చుట్టుముట్టారు. ఇక వీరికి మద్దతుగా అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగానూ వందలాది స్థలాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. 
 
ఈ భారీ జన సందోహంలో తమతల్లులతో పాటు పిల్లలు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. మేం ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇక్కడికి రాలేదు. కాని అతడికి మద్దతుగా మాత్రం రాలేదు అని ఒక హోర్డింగ్ పేర్కొంది. దేవుడు ప్రతి ఒక్కరికీ తన ప్రేమను ప్రదర్శిస్తాడన్న భావాన్ని పంచుకోవడానికే మేమిక్కడికి వచ్చాం అని అందులో రాశారు. 
 
ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో గర్భనిరోధం, హెల్త్ కేర్, గే హక్కులు, వాతావరణ మార్పు వంటి అంశాలపై ప్రదర్శించిన వైఖరిని దుమ్మెత్తిపోస్తూ వాషింగ్టన్ నగరంలో మహిళలు చేసిన నినాదాలు న్యూయార్క్, ఫిలడెల్పియా, చికాగో, లాస్ ఏంజెల్స్ నగరాల నుంచి పారిస్, బెర్లిన్, లండన్, ప్రేగ్, సిడ్నీ, ప్రేగ్, కోపెన్ హాగెన్ తదితర యూరప్ నగరాలల్లో కూడా మహిళా ప్రదర్శనల్లో ప్రతిధ్వనించాయి.  మయన్మార్ నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా కనీసం 600 మహిళా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని సమాచారం. 
 
అమెరికా చరిత్రలో ఇంతకంటే బాధ్యతా రహితమైన, పురుషాహంకారి అయిన, ప్రమాదకారి అయిన వ్యక్తిని ఇకపై కూడా ప్రెసిడెంట్‌గా చూడలేమని సౌత్ కరోలినా యూనివర్శిటీ టీచర్ శశికా కోనెన్ స్నిడర్ పేర్కొన్నారు. 
 
అమెరికాలో గత కొన్ని వారాలుగా చెలరేగుతున్న ట్రంప్ వ్యతిరేక మార్చ్‌లు శనివారం నాటి మహిళల ప్రపంచవ్యాప్త ప్రదర్శనలతో పరాకాష్టకు చేరుకున్నాయి. వందల సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు తిరగబడ్డం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో ట్రంప్ సమీప భవిష్యత్తులో పదవీ చ్యుతుడై ఉపాధ్యక్షుడే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినా ఆశ్చర్యపడనవసరం లేదంటూ అమెరికన్ రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్గం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న ఆ పవర్‌ ప్రాజెక్టులు ఆపండి: పాకిస్థాన్