ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,42,135కు చేరింది. ఇందులో 9,03,072 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,710 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు.
దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,353 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,745 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 35,741 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే పాక్షిక లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది.