Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతిలో 20 సంస్థలకు 126 ఎకరాల కేటాయింపు...

అమరావతిలో 20 సంస్థలకు 126 ఎకరాల కేటాయింపు...
, బుధవారం, 24 అక్టోబరు 2018 (21:37 IST)
అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 126 ఎకరాలు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని ఆర్థిక మంత్రి చాంబర్‌లోని సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఉపసంఘం సమావేశం జరిగింది.


సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించామని, కొన్నిటిని తిరస్కరించామని, మరి కొన్నిటిని వాయిదావేశామని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు 5.56 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ భూములకు ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు నిర్ణయించినట్లు చెప్పారు.
 
గతంలో పది విభాగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలు కేటాయించినట్లు వివరించారు. ఆ భూములకు సంబంధించి ఆయా సంస్థలు రూ.506 కోట్లకు రూ.386 కోట్లు సీఆర్డీఏకు చెల్లించినట్లు తెలిపారు. మొత్తం సంస్థల నిర్మాణం, పెట్టుబడుల మొత్తం విలువ రూ.45,675 కోట్లని  చెప్పారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి సంస్థలు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.
 
29 గ్రామాలు సమానంగా అభివృద్ధి
రాజధాని పరిధిలోని 29 గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందేవిధంగా భూ కేటాయింపులు జరగాలని అంతకు ముందు జరిగిన మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. నబార్డ్‌కు ఇచ్చే భూమి విలువను ఎకరాకు రూ.2 కోట్లుగా నిర్ణయించారు. రామకృష్ణ మిషన్, ఉన్నత విద్యా శాఖ, ఏపీ ఫైబర్ నెట్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఘం, అంతర్జాతీయ క్రికెట్ అకాడమి, కెనరా బ్యాంక్, విజయా బ్యాంక్, ఏపి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, ఏపీ ఫైనాన్సియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్, అమరావతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అకాడమి తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయింపుతోపాటు వాటి ధరలు నిర్ణయించారు.

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, స్పెషల్ కమిషర్ వి.రామమోహన రావు, అడిషనల్ కమిషనర్ ఎస్. షాన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షిరిడీ వెళుతున్నారా...? అయితే ఇది ఖచ్చితంగా చదవాల్సిందే..?