జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల తిత్లీ తఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సహాయ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ని పవన్ కలిసి శ్రీకాకుళం ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో ఆదుకోవాలి అంటూ నివేదిక అందచేసారు. ఇదిలాఉంటే... పవన్ కళ్యాణ్ లక్నోకు బయలుదేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
పవన్ కళ్యాణ్, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులతోపాటు విద్యావేత్తలు, బుద్ధిజీవులు లక్నో చేరుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో పాటు ముఖ్యమైన బీఎస్పీ నేతలతో చర్చలు జరిపేందుకే పవన్ వెళ్లినట్టు సమాచారం.
వీరి మధ్య సాగే చర్చలపై ఎటువంటి సమాచారం లేకున్నా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలని చూస్తున్న రాజకీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు పవన్ వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్‌నూ పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.