రాష్ట్ర విభజన జరిగిన దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీ ప్రజలు కస్సుమంటున్నారు. అసలు ఆ పార్టీ తరపున నిలబడితే ప్రజలు ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అలాంటి స్థితి నుంచి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ పదవి చేపట్టిన దగ్గర్నుంచి తనదైన శైలిలో ధైర్యంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి పార్టీ గూటికి పలువురు నాయకులు చేరుతున్నారు. మరోవైపు షర్మిల సభలకు జనం కూడా వస్తున్నారు. ఈరోజు జరిగిన కర్నూలు జిల్లా సభకు ప్రజలు చెప్పుకోదగ్గ స్థాయిలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్లో పేర్కొంటూ... ''ఏపీ న్యాయ యాత్రకు తరలివస్తున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. కర్నూల్ జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు సభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతఙ్ఞతలు. మీ వైయస్ఆర్ బిడ్డకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.
మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయొద్దు. మీ ఓటు వృధా కానివ్వొద్దు.. వైసీపీకి, టీడీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అధికారమిస్తే 2.25లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అలోచించి ఓటు వెయ్యండి. మీ బిడ్డల బంగారు భవిష్యత్ మీ ఓటు పైనే ఆధారపడి ఉంది. వైయస్ఆర్ సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం."