నెల్లూరు - ఆత్మకూరుల్లో చెత్త కుండీలో వీవీ ప్యాట్ల ఓటర్ రసీదులు

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ అత్యంత చెత్తగా జరిగినట్టు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గగ్గోలుపెడుతున్నారు. టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో అరుస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు. 
 
ఈ క్రమంలో వీవీ ప్యాట్లో ఉండాల్సిన ఓటర్ రసీదు నెల్లూరులోని ఓ కాలేజీ, ఇదే జిల్లాలోని ఆత్మకూరులోని  ప్రభుత్వ కాలేజీలో కుప్పలుతెప్పలుగా లభించాయి. ఈ విషయాన్ని టీడీపీ సాంకేతిక నిపుణుడు, ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
'నెల్లూరులోని ఓ జూనియర్ కాలేజీ వద్ద ఎవరో ఈ ఓటర్ రసీదును చూశారు. ఇది మాక్ పోలింగ్ సందర్భంగా తీసిన రసీదు అయ్యుంటుందా? అయితేమాత్రం, వీవీ ప్యాట్ నుంచి వచ్చిన ఎలాంటి రసీదునైనా భద్రపరచాల్సిన అవసరంలేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?' అంటూ మండిపడ్డారు.
 
కేంద్ర ఎన్నికల సంఘానికి సాయపడేందుకు ఎంతోమంది విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వాళ్లను వేధించే బదులు రక్షణ కల్పిస్తే చాలని హరిప్రసాద్ తన ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా, ఆ ఓటర్ రసీదులో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ విషయం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అయిన ముత్యాలరాజుకు చేరింది. దీంతో ఆయన వీటిని పరిశీలించి విచారణకు ఆదేశించారు. తర్వాత వివరణ ఇస్తూ, కళాశాల వద్ద పడివున్న స్లిప్పులు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినప్పుడు (మాక్ పోలింగ్) సందర్భంగా వాడినవని చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్షణ సమయంలో వాడిన స్లిప్పులను కూడా జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ ఘటనపై స్థానిక అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జయప్రద గుట్టు విప్పుతా... అజంఖాన్ సంచలన వ్యాఖ్యలు