Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఒక్క స్థానంలో గెలిచే పార్టీదే అధికారం..

Advertiesment
ఆ ఒక్క స్థానంలో గెలిచే పార్టీదే అధికారం..
, సోమవారం, 25 మార్చి 2019 (12:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీల మధ్యే కఠిన పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ... వాటి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఏపీ రాజకీయాల్లో ఉభయగోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు జిల్లాల ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగానే అంతిమ తీర్పు ఆధారపడివుంటుంది. 
 
గత 2014 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే (టీడీపీ - బీజేపీ పొత్తు)తో పాటు హీరో పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా టీడీపీకి గోదావరి వాసులు పట్టం కట్టారు. 
 
ఇదిలావుంటే, ఏపీ రాజకీయాల్లో ఏలూరు నియోజకవర్గానికి ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ జెండా ఎగిరితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
 
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల చరిత్రను తిరగేస్తే అది నిరూపణ అయింది కూడా. ఈ సెంటిమెంట్ 1989 నుంచి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు (ప.గో.జిల్లా కేంద్రం) నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే.. అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటోంది. ఇలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు ఏకంగా 1989-2014 వరకు జరిగింది. ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టిని పెడతున్నాయి.
 
ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం నుంచి బడేటి కోట రామారావు (బుజ్జి) టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోట రామారావుకే ఈసారి కూడా టీడీపీ టికెట్‌ను ఖరారు చేసింది. దీంతో 2019 ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బుజ్జి  పట్టుదలతో ఉన్నారు. 
 
ఇకపోతే వైకాపా నుంచి జిల్లా అధ్యక్షుడు, ఆళ్ళ కాశీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని) పోటీలో ఉండగా.. జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు బరిలోకి దిగారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. జనసేన పార్టీ కొత్తగా ఎన్నికల బరిలో నిలబడిన కారణంగా టీడీపీ, వైసీపీ పార్టీల ఓట్లకు జనసేన గండి కొడుతుందనే గుబులు రెండు పార్టీ వర్గాల్లోనూ ఉంది. అయితే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏపార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాష్ రాజ్ ఆస్తులు ఎంతో తెలుసా?