Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లెక్కల్లో మునిగిపోయిన అభ్యర్థులు.. ఎవరి లెక్కలు వారివే... అందరిదృష్టీ అతనిపైనే...

లెక్కల్లో మునిగిపోయిన అభ్యర్థులు.. ఎవరి లెక్కలు వారివే... అందరిదృష్టీ అతనిపైనే...
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ఉత్కంఠగా మారింది. ఇపుడు పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, పార్టీలు ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయిని కొందరు అంటే.. తమకు ఇంత మెజార్టీ రావొచ్చంటూ మరికొందరు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద ఓటరన్న ఇచ్చిన తీర్పు ఇపుడు ఈవీఎంలో నిక్షిప్తమైవుంది. మే 23వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ, విపక్ష వైకాపా, సినీరంగాన్ని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీల మధ్య హోరాహారీగా పోరు జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ.. వాటి ప్రభావం నామమాత్రంగా కూడా కనిపించలేదు. దీంతో టీడీపీ, వైకాపా, జనసేన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఫలితంగా తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కేవలం అభివృద్ధి, మహిళ, రైతుల కోసం అమలు చేసిన నగదు పంపిణీ పథకాలను నమ్ముకుని పోటీ చేసింది. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించినా, కేంద్రం నిధులు ఇవ్వకున్నా అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదని సీఎం చంద్రబాబు ప్రకటించి, ఆ విధంగానే పాలన సాగిస్తూ వచ్చారు. గత ఐదేళ్ళ కాలంలో సంక్షేమ పథకాలతో పాటు రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఆదరించిన తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం సుసంపన్నం చేస్తామని హామీలిచ్చారు. వృద్ధులకు పింఛన్ మొత్తాలను పెంచుతూ యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని హామీలిచ్చారు.
 
ఇకపోతే, గత ఐదేళ్ల కాల తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి పెరిగిపోయిందనీ, అందువల్ల తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. పాదయాత్రతో పాటు.. వివిధ రకాల యాత్రలతో రాష్ట్రాన్ని చుట్టేశారు. జగన్‌కు అండగా, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతిలు కూడా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది మాత్రం ఒక్కటే.. వైకాపాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధేయపడ్డారు.
 
ఇకపోతే, సెలెబ్రిటీ హోదాను కాదనుకుని జనసేన పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన నేత పవన్ కళ్యాణ్. తనకు అధికారం ముఖ్యంకాదనీ ప్రశ్నించడమేనని చెప్పారు. తన ప్రచారాలతో ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టించారు. కాపు ఓటు బ్యాంకుతో పాటు తన ఫ్యాన్స్‌ అండతో రాజకీయ బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్... ఇరు పార్టీలకు ప్రధాన శత్రువుగా మారి ముచ్చెమటలు పోయించారు. ఇపుడు ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? ఎంత మేరకు ఓట్ల శాతాన్ని కైవసం చేసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత 2009 ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లలో గెలుపొందిన విషయం తెల్సిందే. ఇపుడు జనసేన పార్టీ ఎన్ని సీట్లలో గెలుస్తుందన్న చర్చ మొదలైంది. మొత్తంమీద ఇటు అభ్యర్థులతో పాటు అటు పార్టీల అధినేతలు లెక్కల్లో మునిగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో గెలుపోటములను శాసించనున్న ఉభయ గోదావరి ఓటర్లు