ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ విశాఖ జిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. దీంతో తమ తమ నేతల గెలుపోటములపై ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మంత్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆరుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఓటమిచెందారు. ప్రస్తుతం తొమ్మిదోసారి బరిలో దిగారు.
ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీకి చెందిన పెట్ల ఉమా శంకర్‌గణేష్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికలలో గణేష్‌పై అయ్యన్నపాత్రుడు 2,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోసారి ఇరువురు గతంలో మాదిరిగానే టీడీపీ, వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు నియోజకవర్గంలో రోడ్లు ఇతరత్రా అభివృద్ధికి అయ్యన్నపాత్రుడు భారీగా నిధులు తీసుకువచ్చారు.
దీనికితోడు రుత్తల ఎర్రాపాత్రుడు శుక్రవారం పార్టీలో చేరడం అయ్యన్నకు కొంతవరకు కలిసి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప కూడా రేపోమాపో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆమె కూడా వస్తే అయ్యన్న బలం పెరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా గతసారి స్వల్ప తేడాతో ఓటమి చెందిన గణేష్ సానుభూతి ఓట్లపై ఆధారపడి ఉన్నారు.