విశాఖపట్టణం లోక్‌సభ స్థానానికి సీబీఐ మాజీ జేడీ వి.లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. ఈయన జనసేన పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. మంగళవారం విశాఖ లోక్‌సభ బరిలో వి.లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని స్పష్టం చేసింది.
ఇకపోతే, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తమ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి చోటు దక్కని విషయం తెలిసిందే. దీంతో, తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్పీవై రెడ్డితో జనసేన అధిష్టానం సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్పీవై రెడ్డిని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాల సమాచారం.
ఇకపోతే, ఇటీవల జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ తోడల్లుడు, శ్రీకృష్ణదేవరాయ మాజీ ఉపకులపతి రాజగోపాల్‌ను అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. కానీ, ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఆయనకు పార్టీలో ఉన్నతమైన పదవిని ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.