కొన్ని సంవత్సరాలుగా అధికారం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వైకాపా నేతలు ఎన్నికల ప్రచారంలో కూడా వింత పోకడలు పోతున్నారు. డబ్బు మత్తులో తూగుతున్నారు. అధికారం కోసం డబ్బులను మంచినీళ్లలా ప్రవహించాలని నిర్ణయించుకున్నారు.
వివరాలలోకి వెళ్తే... కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల గ్రామంలో వైకాపా నేతలు డబ్బులు వెదజల్లారు. వైకాపా తరపున ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తున్న బ్రిజేందర్ రెడ్డి బుధవారం రాత్రి సిరివెళ్ల గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తూ.. వైకాపా అధినేత జగన్ నంద్యాల పట్టణంలో రానున్నారని చెప్పారు. నంద్యాలలో వైకాపాకి వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో జగన్ సభకు ఆళ్లగడ్డ, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలను నంద్యాలకు తరలించాలని భావించారు.
ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న బ్రిజేందర్‌రెడ్డి బుధవారం సదరు గ్రామానికి వెళ్లి జగన్ సభకు రావలసిందిగా ఆహ్వానిస్తూ ప్రజల మీదకు డబ్బులు వెదజల్లారు. నోట్లు అందుకునే క్రమంలో ప్రజల మధ్య తొక్కిసలాట జరిగి... కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కూడా ఆళ్లగడ్డ, శిరివేముల పట్టణంలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.